మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో సెమీఫైనల్స్‌లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. అక్టోబర్ 30న నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం 3 గంటలకు ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ విషయం తెలిసిన టీమిండియా ఫాన్స్ కాస్త కంగారుపడుతున్నారు. ‘అబ్బా సాయిరాం.. ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియాను భారత్ ఓడించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (13), దక్షిణాఫ్రికా (10), ఇంగ్లాండ్ (9), భారత్ (6) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అక్టోబర్ 26 భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా భారత్ 8 పాయింట్లను మాత్రమే సాధిస్తుంది. అప్పుడు కూడా నాలుగో స్థానంలోనే ఉంటుంది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు గెలిచినా 11 పాయింట్లే సాధిస్తుంది. 13 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంటుంది. మొదటి, నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ జట్లు అక్టోబర్ 30న సెమీస్‌లో ఢీకొట్టనున్నాయి.
Also Read: Cyclone Montha: ప్రజలను అప్రమత్తం చేయండి.. రైతులకి ముందస్తు సమాచారం ఇవ్వండి: పవన్
ఇక ఈరోజు ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టామ్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లు ఆడాయి. ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టును కంగారూలు చిత్తుగా ఓడించారు. 98 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 6.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (5), ఎలిస్ పెర్రీ (0) త్వరగా పెవిలియన్ చేరినా.. జార్జియా వాల్ (38), బెత్ మూనీ (42)లు చెలరేగారు. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 24 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. అలానా కింగ్ (7/18) చెలరేగడంతో ప్రొటీస్ టీమ్ అల్లాడిపోయింది. లారా వోల్వార్డ్ట్ (31) టాప్ స్కోరర్ కాగా.. సినాలో జాఫ్తా (29), నాడిన్ డిక్లర్క్ (14) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు.
