India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..

Team India

Team India

India Cricket: క్రికెట్ అభిమానులకు శనివారం రోజు అసలైన పండగ లాంటి రోజనే చెప్పాలి. ఎందుకంటే ఒకే రోజు ఏకంగా మూడు కీలక మ్యాచ్‌లు ఉన్నాయి. వీటిలో ఒకటి మాత్రం ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగే హై-వోల్టేజ్ పోరు కాగా, మరొకటి వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్. ఇక మూడోది మాజీ దిగ్గజాలు తలపడే లెజెండ్స్ మ్యాచ్. ఆ మూడు మ్యాచ్‌ల వివరాలు ఇక్కడ చూద్దాం.

మొదటి మ్యాచ్ భారత్, పాకిస్థాన్ మధ్య ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆసియా క్రీడలు 2026లో భాగంగా జరిగే ఈ పురుషుల టీ20 ఫైనల్ మ్యాచ్‌లో పసిడి పతకం కోసం ఇరు జట్లు తలపడనున్నాయి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని భారత జట్టు ఈసారి గోల్డ్ మెడల్ కొట్టాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందా? లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

ఇక రెండో మ్యాచ్ భారత్, వెస్టిండీస్ మధ్య మధ్యాహ్నం 2 గంటలకు మోహాలీ వేదికగా జరగనుంది. ఇది వన్డే మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మన స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మైదానంలో దిగనున్నారు. ఈ సిరీస్‌ను ఇప్పటికే చేజిక్కించుకున్న టీమిండియా, ఆఖరి వన్డేలోనూ విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లోని తుది జట్టులో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఈ రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు మాజీ క్రికెట్ దిగ్గజాల ఆటను చూసే అద్భుతమైన అవకాశం కూడా ఉంది. వరల్డ్ ఛాంపియన్‌‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026 టోర్నమెంట్ నేటి నుంచే అట్టహాసంగా ప్రారంభం కానుంది. సాయంత్రం 5:00 గంటలకు షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాపియన్స్ జట్టు, ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, యూసుఫ్ పఠాన్, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్ వంటి మన పాత తరం స్టార్ల ఆటను మరోసారి చూడొచ్చు.