Site icon NTV Telugu

IND vs NZ 5th T20: అర్ష్‌దీప్ సింగ్ ‘పంజా’, ఇషాన్ విధ్వంసం.. కివీస్ పై భారత్ ఘన విజయం

Ind Vs Nz T20

Ind Vs Nz T20

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో ఐదవ, చివరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 05 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. కివీస్ కు 272 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ 19.4 ఓవర్లలో 225 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా సంజు సామ్సన్, అభిషేక్ శర్మలతో ఓపెనింగ్ ప్రారంభించింది.

Also Read:Anil Ravipudi : రావిపూడికి సురేష్ బాబు టెన్షన్.. ‘ఫ్రీడమ్’ దొరుకుద్దా?

అభిషేక్ మొదటి బంతి నుండే తన దాడిని ప్రారంభించాడు, కానీ హోమ్ గ్రౌండ్ లో సంజు సామ్సన్ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి మూడవ ఓవర్‌లో తన వికెట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత ఐదవ ఓవర్‌లో అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అభిషేక్ 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. అయితే, రెండు ప్రారంభ వైఫల్యాల తర్వాత, ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్య ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

10 ఓవర్ల తర్వాత, భారత స్కోరు 100 దాటింది. ఇషాన్ కిషన్ 12వ ఓవర్‌లో కేవలం 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఆ తర్వాత సూర్య 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ సూర్య వికెట్ 15వ ఓవర్‌లో పడిపోయింది. 30 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఇషాన్, సూర్య మధ్య 137 పరుగుల భాగస్వామ్యం కేవలం 57 బంతుల్లోనే జరిగింది. సూర్య తన ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. కానీ ఇషాన్ అక్కడితో ఆగలేదు. అతను కేవలం 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 18వ ఓవర్‌లో ఇషాన్ కిషన్ వికెట్ పడిపోయింది. 43 బంతుల్లో 103 పరుగులు చేశాడు, అందులో 10 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 17 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. టీమ్ ఇండియా తరఫున రింకు సింగ్ 8, శివం దుబే 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

కివీస్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే అర్ష్‌దీప్ సింగ్ భారత్‌కు బ్రేక్‌త్రూ ఇచ్చాడు. టిమ్ సీఫెర్ట్‌ వికెట్ కోల్పోయాడు. తొలి వికెట్ త్వరగా కోల్పోయిన తర్వాత, ఫిన్ అలెన్ న్యూజిలాండ్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఇది భారత్‌పై తొలి అర్ధ సెంచరీ. అక్షర్ పటేల్ 38 బంతుల్లో 80 పరుగులకు ఫిన్ అలెన్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ ఏడు పరుగులు మాత్రమే చేసిన గ్లెన్ ఫిలిప్స్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ సింగ్ అదే ఓవర్‌లో రాచిన్ రవీంద్ర (30), మిచెల్ సాంట్నర్ (0)లను అవుట్ చేయడంతో కివీస్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది.

Also Read:Singeetam Srinivasa Rao : టాలీవుడ్ సెన్సేషనల్ కాంబో ఫిక్స్..

ప్రపంచ నంబర్ 1 స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జాకబ్స్‌ను అవుట్ చేశాడు. జాకబ్స్ 11 బంతుల్లో 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తొమ్మిది పరుగులకే కైల్ జామిసన్‌ను అర్ష్ దీప్ సింగ్ ఔట్ చేశాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదవ T20Iలో అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ తన T20I కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్లు పడగొట్టాడు. డారిల్ మిచెల్‌ను 26 పరుగులకు అవుట్ చేసి, తన ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేసుకున్నాడు. స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ లాకీ ఫెర్గూసన్‌ను అవుట్ చేశాడు. ఫెర్గూసన్ 4 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు.

Exit mobile version