T20 World Cup 2024 India Squad: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 అనంతరం టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 2 నుంచి మెగా టోర్నీ జరగనుంది. పొట్టి ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేసేందుకు మే 1 చివరి తేదీ. ఈ నేపథ్యంలో భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 20 మందిని ఎంపిక చేశారని సమాచారం. ఇందులో 15 మంది ప్లేయర్స్, ఐదుగురు స్టాండ్‌బై ఆటగాళ్లు ఉన్నారట. అయితే ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారిస్తున్న దినేష్ కార్తీక్, రియాన్ పరాగ్‌లకు జట్టులో చోటు దక్కలేదు.
టీ20 ప్రపంచకప్ 2024 కోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన జాబితా సోషల్ మీడియాలో లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల ప్రకారం.. 15 మంది జట్టుతో పాటు అయిదుగురు స్టాండ్ బై ప్లేయర్లు జట్టులో ఉన్నారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ బ్యాటర్లుగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ ఎంపికయ్యారు. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్‌తో పాటు కేఎల్ రాహుల్, సంజు శాంసన్ ఎంపికయ్యారు.
ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివమ్ దూబె, అక్షర్ పటేల్ భారత జట్టుకి ఎంపికయ్యారు. పేస్ బౌలింగ్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్ ఎంపిక కాగా.. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, రవి బిష్ణోయ్ ఎంపికయినట్లు తెలుస్తోంది. అయితే ఈ జట్టులోని కొన్ని ఎంపికలపై భారత ఫాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫామ్‌లో ఉన్న దినేశ్ కార్తీక్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు. పెద్దగా ఆకట్టుకొని లోకేష్ రాహుల్ స్థానంలో డీకేను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్.