World Bank Report: పేదరిక నిర్మూలనలో భారత్ రికార్డు.. 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి విముక్తి.. కానీ..

India Poverty Decline

India Poverty Decline

India Poverty Declines: భారత్‌లో పేదరికం ఊహించని రీతిలో తగ్గిపోతోంది. గత 12 ఏళ్ల కాలంలో (2011 నుంచి 2023 వరకు) దేశంలో ఏకంగా 49.6 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో వెల్లడించింది. దీనివల్ల 2011లో 27.1 శాతంగా ఉన్న అత్యంత తీవ్రమైన పేదరికం (Extreme Poverty) రేటు, 2023 నాటికి ఏకంగా 2.6 శాతానికి పడిపోయిందని స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పేదరికాన్ని తగ్గించిన దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచిందని ప్రపంచ బ్యాంక్ కొనియాడింది.

కేవలం అత్యంత పేదరికమే కాదు, రోజుకు $4.20 డాలర్ల (2021 PPP ప్రాతిపదికన) ఆదాయం పొందే దిగువ-మధ్యతరగతి పేదరిక రేటు కూడా 57.7 శాతం నుంచి 16.1 శాతానికి గణనీయంగా తగ్గింది. ప్రజల వినియోగ వ్యయం పెరగడం, ఉపాధి అవకాశాలు ముఖ్యంగా మహిళలకు పెరగడం, ఆహార రాయితీలతో కూడిన సామాజిక సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు కావడమే ఈ మైలురాయికి ప్రధాన కారణాలని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ పేదరికం మరింత తగ్గుతుందని అంచనా వేస్తోంది. రోజుకు $4.20 డాలర్ల పరిమితి ఆధారంగా చూస్తే, 2026 నాటికి 14.2 శాతంగా ఉండే పేదరికం 2028 నాటికి 12.1 శాతానికి తగ్గిపోవచ్చని పేర్కొంది. అయితే కార్మిక రంగం, ఆర్థిక వ్యవస్థ గణాంకాల్లో వచ్చే మార్పుల ఆధారంగా ఈ అంచనాల్లో కాస్త మార్పులు ఉండే అవకాశం ఉందంది.

కేవలం ఆదాయం లేదా ఖర్చుల ఆధారంగానే కాకుండా, జీవన ప్రమాణాల ఆధారంగా కొలిచే ‘బహుమాణ పేదరికం’ (Multidimensional Poverty) లో కూడా భారత్ అద్భుత పురోగతి సాధించింది. ఆక్స్‌ఫర్డ్ ప్రాజెక్ట్ గణాంకాల ప్రకారం.. 2005-06లో 53.8 శాతంగా ఉన్న బహుమాణ పేదరికం, 2019-21 నాటికి 16.4 శాతానికి తగ్గింది. ప్రపంచ బ్యాంక్ స్వంత గణాంకాల ప్రకారం.. 2022-23 నాటికి ఇది 15.5 శాతానికి పడిపోయింది. అంటే ఆరోగ్యం, విద్య, కనీస సౌకర్యాల కల్పనలో భారతీయుల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని ఇది స్పష్టం చేస్తోంది. ఈ భారీ విజయాల వెనుక కొద్దిగా ఆందోళన కలిగించే సవాళ్లు కూడా ఉన్నాయి. దేశంలోని మొత్తం పేదల్లో దాదాపు 57 శాతం మంది ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్న ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. అక్కడ మరిన్ని కొత్త ఉద్యోగాలు కల్పిస్తేనే ఈ పురోగతి నిలకడగా ఉంటుంది.

ఇక, ఉపాధి విషయానికొస్తే, 2017 నుంచి 2023 మధ్య భారత్ ఏకంగా 13.4 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు కల్పించింది. ఇది దేశంలో పనిచేసే వయస్సు ఉన్న జనాభా పెరుగుదల కంటే రెట్టింపు కావడం విశేషం. గ్రామీణ ప్రాంత మహిళలు ఎక్కువగా ఉపాధిలోకి రావడం ఇందులో కీలక పాత్ర పోషించింది. అయినప్పటికీ, కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. FY26 మొదటి త్రైమాసికంలో 14.6 శాతంగా ఉన్న యువ నిరుద్యోగం, FY27 మొదటి త్రైమాసికానికి 15.9 శాతానికి పెరిగింది. ఇందులో గ్రామీణ యువతులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. అంతేకాకుండా కార్మికుల వాస్తవ ఆదాయాల్లో పెద్దగా మార్పు లేకపోవడం, కొత్తగా వస్తున్న ఉద్యోగాలు తక్కువ ఉత్పాదకత కలిగిన రంగాలు లేదా చిన్న తరహా పని ప్రదేశాల్లోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. మరొకవైపు, ఇటీవల వినియోగ సర్వేల్లో కొలమాన పద్ధతులు మారడం వల్ల కూడా పేదరికం తగ్గింపు గణాంకాల్లో కొన్ని మార్పులు కనిపిస్తుండవచ్చని, ప్రజల జీవన శైలిలో వచ్చిన నమ్మకమైన మార్పులతో పాటు ఈ కొత్త సర్వే పద్ధతులు కూడా కారణం కావచ్చు అని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. ఏది ఏమైనా, పేదరిక నిర్మూలనలో భారత్ సాధించిన విజయం ఎంతో గొప్పది. రాబోయే కాలంలో ప్రాంతీయ వ్యత్యాసాలను తగ్గిస్తూ, నాణ్యమైన ఉద్యోగాలను సృష్టిస్తూ, ప్రజల ఆదాయాలను పెంచడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.