Site icon NTV Telugu

India Post: తపాలా సేవల్లో విప్లవాత్మక మార్పు.. చరిత్రలోకి రిజిస్టర్డ్ పోస్టల్!

India Post

India Post

India Post: భారత తపాలా (Postal) శాఖ దేశవ్యాప్తంగా తన సేవలను మరింత ఆధునికంగా, పారదర్శకంగా మార్చేందుకు సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఒక కీలక మార్పు తీసుకువస్తోంది. ఇప్పటి వరకూ వేర్వేరుగా అందుబాటులో ఉన్న రిజిస్టర్డ్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ సేవలను ఒక్కటిగా విలీనం చేసి.. ఇకపై అన్ని దేశీయ లేఖలు, డాక్యుమెంట్లు, పార్సెళ్లను స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపే విధంగా కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఈ నిర్ణయంతో సేవల వేగం, ట్రాకింగ్ పారదర్శకత మరింత మెరుగవుతుందని తపాలా శాఖ చెబుతోంది. రిజిస్టర్డ్ పోస్ట్‌కి సాధారణంగా సురక్షిత డెలివరీ, డెలివరీకి సంతకం, ప్రూఫ్ వంటి అంశాలు ఉండేవి. మరోవైపు స్పీడ్ పోస్ట్‌కి వేగవంతమైన డెలివరీతోపాటు అధునాతన ట్రాకింగ్ సౌలభ్యం ఉంది. ఇప్పుడు ఈ రెండు సేవలను కలిపి వినియోగదారులకి అన్ని ప్రయోజనాలు ఒకే సేవలో అందించనున్నారు.

Viral News: అంబానీ కంటే ధనవంతురాలిగా మారిన చనిపోయిన మహిళా.. అకౌంట్లోకి 1.13 లక్షల కోట్లు జమ!

ఈ మార్పుతో ఇకపై రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు అందుబాటులో ఉండవు. అన్నీ దేశీయ మెయిల్ సేవలు స్పీడ్ పోస్ట్‌గా పంపబడతాయి. అయితే, డెలివరీకి సంతకం అవసరమయ్యే డాక్యుమెంట్లు పంపాలంటే ‘వాల్యూ యాడెడ్ సర్వీస్’ రూపంలో అదనంగా రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రియల్ టైమ్ ట్రాకింగ్ వ్యవస్థ కూడా ప్రతి వినియోగదారుడికి అందుబాటులో ఉంటుంది. ఇకపోతే రవాణా ఛార్జీలు పార్సల్ బరువు, దూరంపై ఆధారపడి నిర్ణయించబడ్డాయి. ఉదాహరణకు 50 గ్రాముల లోపు పార్సెల్‌కి లోకల్‌గా రూ.15 మాత్రమే, అదే 201–1000 కిమీ దూరానికి రూ.35 వంటివిగా ఛార్జీలు ఉన్నాయి. అలాగే 500 గ్రాముల కన్నా ఎక్కువ బరువున్న పార్సల్లకు ప్రతి అదనపు 500 గ్రాములకు అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీలు టాక్స్‌ను మినహాయించి తెలుపబడ్డాయి.

Oben Rorr EZ Sigma: సింగల్ ఛార్జ్ 175km రేంజ్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ! కొత్త EV బైక్ లాంచ్

అంతేకాదండోయ్.. డెలివరీ సమయంలోనూ స్పష్టమైన గడువులు పేర్కొనబడ్డాయి. లోకల్ మెయిల్‌కి 1–2 రోజులు, మెట్రో టు మెట్రో 1–3 రోజులు, అదే రాష్ట్రానికి 1–4 రోజులు, దేశంలోని మిగిలిన ప్రాంతాలకు 4–5 రోజులు పడుతుంది. ఇది వినియోగదారులకు ముందు నుంచే సరైన అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఈ కొత్త మార్పుల నేపథ్యంలో ముఖ్యమైన లేదా వేరే ఏదైనా పంపే వారు తప్పనిసరిగా స్థానిక పోస్టాఫీస్‌ను సంప్రదించి ‘వాల్యూ యాడెడ్’ సేవల వివరాలు తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి, ఈ కొత్త నిర్ణయంతో భారత తపాలా వ్యవస్థ ఒక నూతన దశలోకి అడుగుపెడుతోంది. వేగం, పారదర్శకత కలగలిసిన సేవలతో దేశ ప్రజలకు మరింత నమ్మకమైన తపాలా అనుభవాన్ని అందించేందుకు భారత తపాలా శాఖ సిద్ధమవుతోంది.

Exit mobile version