India vs Pakistan WCL 2025 Semifinal Controversy: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. జూలై 31న బర్మింగ్‌హామ్‌లో జరగాల్సిన డబ్ల్యూసీఎల్ సెమీఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో మ్యాచ్ ఆడటానికి భారత ఆటగాళ్లు నిరాకరించినట్లు సమాచారం. సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో ఆడటానికి భారత ప్లేయర్స్ నిరాకరించారు అని జాతీయ వార్తా సంస్థ IANS తమ నివేదికలో పేర్కొంది. అయితే దీనిపై డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
డబ్ల్యూసీఎల్ 2025 భారత్, పాకిస్థాన్ సెమీఫైనల్ మ్యాచ్‌ను తాము స్పాన్సర్ చేయలేమని ఇప్పటికే టోర్నీ స్పాన్సర్స్ ‘ఈజ్ మై ట్రిప్’ ప్రకటించింది. ఉగ్రవాదం, క్రికెట్ ఎప్పటికీ కలిసి ముందుకు వెళ్లలేవని ఈజ్ మై ట్రిప్ కంపెనీ కో ఓనర్ నిశాంత్ పిట్టి పోస్ట్ చేశారు. భారత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ.. మేము ఈ మ్యాచ్ నుండి వైదొలుగుతున్నామని స్పష్టం చేశారు. తమ మొదటి ప్రాధాన్యం దేశం అని, ఆ తర్వాతే వ్యాపారం అని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంకు తాము ఏమాత్రం మద్దతు ఇవ్వం అని నిశాంత్ పిట్టి చెప్పుకొచ్చారు. లీగ్ దశలో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు భారత ప్లేయర్స్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సెమీఫైనల్లో కూడా ఆడం అని చెప్పారట.
Also Read: Perni Nani: ఏం పోయేకాలం వచ్చింది.. కూటమి ప్రభుత్వం కుప్పకూలటం ఖాయం!
భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్ సహా మరికొందరు పాకిస్థాన్‌తో లీగ్ మ్యాచ్ ఆడబోమని చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ధావన్, రైనా అయితే పాకిస్థాన్‌తో ఎట్టి పరిస్థితుల్లో ఆడేది లేదని స్పష్టం చేశారు. స్పాన్సర్ తప్పుకోవడం, భారత ప్లేయర్స్ ఆడమని చెప్పడంతో నిర్వాహకులు ఏ నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తి నెలకొంది. సెమీఫైనల్ మ్యాచ్‌ను మారుస్తారా? లేదా పాకిస్థాన్‌ను ఫైనల్ చేర్చుతారా? అని ఉత్కంఠ నెలకొంది. టోర్నీ లీగ్ దశలో 5 మ్యాచ్‌లు ఆడిన భారత్ ఛాంపియన్స్ ఒకే విజయం సాధించింది. అయితే మెరుగైన రన్ రేట్‌తో సెమీస్‌కు అర్హత సాధించింది. పాకిస్థాన్, దక్షణాఫ్రికాలు టాప్-2లో ఉండగా.. ఆస్ట్రేలియా మూడో స్థానంలో, భారత్ నాలుగో స్థానంలో ఉన్నాయి.
