NTV Telugu Site icon

India-Ukraine: ఉక్రెయిన్‌కు మద్దతుగా సంతకం చేయని భారత్.. కారణమేంటంటే..!

Ukrine

Ukrine

స్విట్జర్లాండ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో శాంతికి సంబంధించిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ వెనుకడుగు వేసింది. ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా హాజరు కాకూడదని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో శాంతికి ముందడుగు పడే అవకాశం లేదని.. దీని వలన సమయం వృధా అని భారత్ భావించింది. ఈ నేపథ్యంలో సంతకం చేసేందుకు భారత్ ముందుకు రాలేదు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సహా 50 మందికి పైగా దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు.. ఇందుకోసం ఒక మార్గాన్ని రూపొందించడానికి స్విట్జర్లాండ్‌లో రెండు రోజుల పాటు సదస్సు ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి రష్యా మాత్రం హాజరుకాలేదు. స్విస్ ఆల్పైన్ రిసార్ట్ ఆఫ్ స్టాన్స్‌స్టాడ్‌లో రెండు రోజుల చర్చలు జరిగాయి.

ఈ సమావేశానికి ఇండియా తరపున విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పవన్ కపూర్ ప్రాతినిధ్యం వహించారు. అయితే ఉక్రెయిన్‌లో చర్చల ద్వారా పరిష్కారానికి మార్గాలను అన్వేషించడం భారత్ ఉద్దేశం అని కపూర్ తెలిపారు. అన్ని పక్షాలు చర్చల్లో భాగం కావాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది. మా విధానం స్థిరంగా ఉందని.. సమాధానం లేదా దౌత్యం ద్వారా మాత్రం శాశ్వత శాంతికి మార్గం చూపించొచ్చని భారత్ పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఆచరణాత్మక పరిష్కారం చూపించాలని భారత్ అభిప్రాయపడింది.

సమ్మిట్‌లో దేశాధినేతలతో సహా 100కి పైగా దేశాలు మరియు సంస్థల నుంచి ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లో సమావేశం అయ్యారు. చైనా కూడా హాజరు కావడం విశేషం. కొన్ని దేశాలు ఉక్రెయిన్ మద్దతుగా సంతాకాలు చేయగా.. భారత్‌తో పాటు ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా దేశాలు శాంతి పత్రంలో సంతకాలను నిలిపివేసినట్లు వార్తా సంస్థ తెలిపింది.