Site icon NTV Telugu

Team India: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత్ ఓటమికి 3 ప్రధాన కారణాలు ఇవే!

India Odi Series Loss

India Odi Series Loss

అడిలైడ్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 264 రన్స్ చేసింది. 265 పరుగుల టార్గెట్‌ని ఆసీస్ 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది. మొదటి రెండు వన్డేల్లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలుచుకుంది. 17 సంవత్సరాల తర్వాత అడిలైడ్ ఓవల్‌లో భారత్ వన్డే మ్యాచ్‌ను ఓడిపోయింది. భారత్ వన్డే సిరీస్ ఓటమికి ప్రధాన కారణాలు ఏంటో చూద్దాం.

విరాట్ కోహ్లీ డకౌట్లు:
ఈ వన్డే సిరీస్‌కు సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి వచ్చారు. ఆస్ట్రేలియాలో ఇద్దరు రాణిస్తారని అందరూ ఆశించారు. అయితే మొదటి వన్డేలో రోహిత్ నిరాశపరిచినప్పటికీ.. రెండవ వన్డేలో అర్ధ సెంచరీ చేశాడు. మరోవైపు కోహ్లీ రెండు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లు అతడిని ఖాతా కూడా తెరవనీయలేదు. రెండు వన్డేల్లోనూ కింగ్ డకౌట్ అయ్యాడు. కోహ్లీ పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన సిరీస్ ఓటమికి ప్రధాన కారణం. ఆస్ట్రేలియాలో వరుసగా రెండు వన్డేల్లో విరాట్ డకౌట్ కావడం ఇదే మొదటిసారి.

కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వకపోవడం:
కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ రెండు వన్డేల్లోనూ మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించలేదు. ఆస్ట్రేలియా పెర్త్‌లో మాథ్యూ కుహ్నెమాన్‌ను ఆడించగా, అడిలైడ్‌లో ఆడమ్ జంపాకు అవకాశం ఇచ్చింది. పెర్త్‌లో కుహ్నెమాన్ రెండు వికెట్లు తీసి భారత జట్టును దెబ్బతీశాడు. రెండవ వన్డేలో జంపా నాలుగు వికెట్లు తీసి భారత ఇన్నింగ్స్‌ను కుదిపేశాడు. కానీ భారత జట్టు యాజమాన్యం కుల్దీప్ యాదవ్‌కు రెండు మ్యాచ్‌లలోనూ అవకాశం ఇవ్వలేదు. కుల్దీప్ ఆడుంటే భారత్ మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి.

Also Read: Smriti Mandhana: ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన స్మృతి మంధాన!

పేలవ ఫీల్డింగ్:
భారత జట్టు పేలవమైన ఫీల్డింగ్ కూడా వన్డే సిరీస్ ఓటమికి ఒక కారణం. ప్రస్తుత సిరీస్‌లోని రెండు వన్డేల్లో భారత్ 3 క్యాచ్‌లను నేలపాలు చేసింది. పెర్త్‌లో భారత ఫీల్డర్లు ఒక క్యాచ్‌ను వదిలేయగా.. అడిలైడ్‌లో రెండింటిని వదిలారు. కీలక బ్యాటర్ మాథ్యూ షార్ట్‌ క్యాచ్ వదిలేశారు. ఆసియా కప్ నుంచి మొత్తం 15 క్యాచ్‌లను నేలపాలు చేశారు. భారత్ ఫీల్డింగ్ తప్పక మెరుగుపడాలి. సిరీస్‌లోని మూడవ వన్డే 25న సిడ్నీలో జరుగుతుంది.

Exit mobile version