India New Jersey: భారత హాకీ జట్లు ఎన్నో ఏళ్లుగా ధరిస్తున్న సంప్రదాయ నీలం (Blue) జెర్సీకి గుడ్‌బై చెప్పింది. రానున్న FIH హాకీ ప్రపంచకప్ కోసం భారత పురుషులు, మహిళల జట్లు తొలిసారిగా కాషాయ (Saffron) రంగు జెర్సీతో బరిలోకి దిగనున్నాయి. నెదర్లాండ్స్, బెల్జియంలో ఆగస్టు 15 నుంచి 30 వరకు జరిగే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని హాకీ ఇండియా ఈ కొత్త జెర్సీని ఆవిష్కరించింది.
అయితే హాకీ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. భారత మాజీ కెప్టెన్ వీరెన్ రస్క్విన్హా కూడా స్పందిస్తూ.. తాను కెరీర్ మొత్తం బ్లూ జెర్సీని గర్వంగా ధరించానని, అదే భారత జాతీయ జట్టుకు గుర్తింపుగా నిలిచిందని పేర్కొన్నారు. దీంతో జెర్సీ మార్పుపై వివాదం మరింత ముదిరింది. ఈ విమర్శలకు స్పందించిన హాకీ ఇండియా.. ఈ నిర్ణయం పూర్తిగా సాంకేతిక కారణాలతోనే తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు ఎక్కువగా నీలం రంగు సింథటిక్ టర్ఫ్ పై జరుగుతున్నాయని.. బ్లూ జెర్సీ కారణంగా ఆటగాళ్లను గుర్తించడం, మైదానంలో స్పష్టత కొంత మేర ప్రభావితమవుతోందని తెలిపింది. ఈ అంశంపై కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, ఆటగాళ్లతో విస్తృతంగా చర్చించిన తర్వాతే కొత్త జెర్సీ రంగును ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
ఇందులో భాగంగా మొదట ప్రత్యామ్నాయంగా పసుపు లేదా కాషాయ రంగులను పరిశీలించినట్లు హాకీ ఇండియా తెలిపింది. చివరకు భారత జాతీయ పతాకంలోని ఒక ప్రధాన రంగు అయిన కాషాయాన్ని ఎంపిక చేశారు. హాకీ ఇండియా ప్రకారం.. కాషాయ రంగు ధైర్యం, త్యాగం, విజయానికి ప్రతీక. అందువల్ల ఇది సాంకేతిక అవసరాలను తీర్చడమే కాకుండా జాతీయ గౌరవాన్ని కూడా ప్రతిబింబిస్తుందని పేర్కొంది.
కొత్త జెర్సీ ప్రత్యేకతలు:
ఈ కొత్త జెర్సీలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే డిజైన్‌లు ఉన్నాయి. అశోక చక్రం స్ఫూర్తితో రూపొందించిన నేవీ బ్లూ ఆకృతులు శాంతి, పురోగతి, ఏకాగ్రతకు సంకేతంగా ఉన్నాయి. ఛాతీపై ఉన్న ప్రత్యేక గ్రాఫిక్ సుదర్శన చక్రం ఆధునిక రూపాన్ని సూచిస్తూ బలం, ఐక్యత, వేగాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే భుజాలు, పక్క భాగాల్లో త్రివర్ణ పతాక రంగుల స్ట్రిప్స్ ను జోడించారు. ముందు భాగంలో ‘INDIA’ అనే పదాన్ని ప్రత్యేక దేవనాగరి శైలిలో ముద్రించి భారత భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పారు.
తెలుపు జెర్సీ కూడా..
కాషాయ జెర్సీతో పాటు ఇదే డిజైన్‌లో తెలుపు (White) జెర్సీని కూడా హాకీ ఇండియా విడుదల చేసింది. ప్రత్యర్థి జట్టు జెర్సీలను బట్టి అవసరమైనప్పుడు ఈ జెర్సీని ఉపయోగించనున్నారు. ఈ కొత్త జెర్సీ “ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్” స్ఫూర్తిని ప్రతిబింబించేలా రూపొందించబడింది. అయితే బ్లూ జెర్సీకి వీడ్కోలు పలకడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Presenting the new India jersey! 🇮🇳
Every stitch tells a story. Every pattern, every colour carries India's pride.
Our teams are ready to once again do the country proud at the FIH Hockey World Cup Belgium & Netherlands 2026.
🎥: Select 2 (SD+HD)+ Khel & JioHotstar
🗓️: August… pic.twitter.com/8GvwbByapq— Hockey India (@TheHockeyIndia) July 27, 2026

