India Hikes Gold and Silver Import Duty Charges increased: భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు.. అది భద్రత, పెట్టుబడి, సంప్రదాయం. అలాంటి బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ పన్ను భారం మోపింది. నేటి (మే 13) నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిర్ణయంతో బంగారం, వెండిపై మొత్తం దిగుమతి సుంకం 15% కి పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు మరింత ఎగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2024లో బడ్జెట్ సమయంలో స్మగ్లింగ్‌ను తగ్గించడం, జ్యువెలరీ రంగానికి ఊతమివ్వడం లక్ష్యంగా కేంద్రం దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6%కి తగ్గించింది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెరుగుతున్న చమురు ధరలు, రూపాయి పతనం, భారీ బంగారం దిగుమతులు కలిసి భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాయి. దీంతో ప్రభుత్వం మళ్లీ పాత పన్ను విధానానికే తిరిగి వెల్లాసి వచ్చింది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం.. బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 5% నుంచి 10% కి పెంచారు. దీనికి అదనంగా 5% అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ కొనసాగుతుంది. అంటే విదేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారం, వెండిపై మొత్తం పన్ను భారం ఇప్పుడు 15% కి చేరింది. ప్లాటినం, జ్యువెలరీ తయారీలో ఉపయోగించే విడిభాగాలు, రీసైక్లింగ్‌కు వచ్చే విలువైన లోహాల వ్యర్థాలపైనా సుంకాలు పెరిగాయి.
మరోవైపు బంగారం దిగుమతులు పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా రికార్డు స్థాయిలో పడిపోయింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఖర్చులను నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అవసరం లేని బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని ప్రజలకు పిలుపునివ్వడం దీనికే సంకేతంగా భావిస్తున్నారు.
