NTV Telugu Site icon

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌తో భారత్‌కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

Icc Odi World Cup 2023 New

Icc Odi World Cup 2023 New

ODI World Cup 2023 India Economic Benefit: 2023 అక్టోబరు-నవంబరులో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఆసీస్‌ ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ ప్రపంచకప్‌ మ్యాచ్‌లను భారత్‌ అభిమానులతో పాటు విదేశీయులు కూడా భారీ సంఖ్యలో ప్రత్యక్షంగా వీక్షించారు. వన్డే ప్రపంచకప్‌ భారత్‌కు రూ.11,637 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించిందని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

2023 వన్డే ప్రపంచకప్‌ సందర్భంగా భారత్‌లో పర్యాటక రంగం అత్యధికంగా లబ్ధి పొందిందని ఐసీసీ సీఈఓ జెఫ్‌ అలార్డైస్‌ తెలిపాడు. ‘వన్డే ప్రపంచకప్‌ 2023 క్రికెట్‌కు సంబంధించి గణనీయమైన ఆర్థిక శక్తిని ప్రదర్శించింది. భారత్‌కు ఏకంగా రూ.11,637 కోట్ల ఆర్థిక ప్రయోజనంను చేకూర్చింది. ఆతిథ్య నగరాల్లో పర్యాటక రంగం ప్రభావం వల్ల ఎక్కువ ఆదాయం వచ్చింది. రికార్డు స్థాయిలో 12.5 లక్షల మంది మ్యాచ్‌లను మైదానాల్లో వీక్షించారు. ఇందులో 75 శాతం మంది తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు హాజరవడం విశేషం. ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు వచ్చిన 68 శాతం విదేశీయులు భారత దేశాన్ని పర్యాటక కేంద్రంగా సిఫారసు చేస్తామన్నారు’ అని అలార్డైస్‌ తెలిపాడు.