Hussainiwala history: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచిపెట్టారు. కానీ దేశాన్ని రెండు భాగాలుగా విభజించడం ద్వారా జీవితాంతం గాయాన్ని మిగిల్చారు. లండన్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ భారతదేశ విభజన రేఖను ఎప్పటికీ మరచిపోలేని విధంగా గీశారు. ఈ విభజన జూలై 18, 1947న ఖరారు చేయబడింది. 14 ఆగస్టు 1947న పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొందింది. సరిగ్గా ఒక రోజు తర్వాత భారతదేశం 15న బ్రిటిష్ చెర నుంచి బయటపడింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సరిగ్గా 14 సంవత్సరాల తర్వాత భారత్- పాక్‌కు 12 గ్రామాలను ఇచ్చింది. అసలు ఇండియా పాక్‌కు ఎందుకు ఈ గ్రామాలకు ఇచ్చింది, దీని వెనుక ఉన్న కారణాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ MORE: Krithi Sanon : ప్రభాస్ హీరోయిన్ లగ్జరీ ఫ్లాట్.. ఎన్ని కోట్లంటే..?
‘హుస్సేనివాలా’ కోసం పాకిస్థాన్‌కు..
విభజన తర్వాత.. ఒకే దేశానికి రెండు సరిహద్దులు ఏర్పడ్డాయి. సరిహద్దుకు ఇరువైపులా ప్రజలు అపరిచితులయ్యారు. శతాబ్దాలుగా ‘అతిథి దేవో భవ’ అని ముక్తకంఠంతో చెబుతున్న అదే పాత భారతదేశం సరిహద్దుకు ఒక వైపున ఉండగా, మరోవైపు కొత్తగా ఏర్పడిన పాకిస్థాన్ ఉంది. రాడ్‌క్లిఫ్ రెండు దేశాల మధ్య చేసిన విభజన ఇక్కడితో ఆగలేదు. 1947 తర్వాత సరిగ్గా 14 సంవత్సరాలకు భారతదేశం – పాకిస్థాన్ మధ్య మరొక విభజన జరిగింది. దేశ మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఈ విభజన జరిగింది. పాకిస్థాన్‌లో భాగమైన ఒక గ్రామం దీనికి కారణమైంది.
హుస్సేనివాలా గ్రామం పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లో భాగంగా ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామం భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో భాగం. ఈ గ్రామం పాక్‌తో సరిహద్దును పంచుకుంటుంది. సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనివాలా గ్రామానికి ఎదురుగా పాకిస్థాన్‌లోని కసూర్ జిల్లాలోని గండాసింగ్ వాలా గ్రామం ఉంది. ఈ గ్రామం ఒకప్పుడు పాక్ – భారత్ మధ్య ప్రధాన సరిహద్దు క్రాసింగ్‌గా పనిచేసింది. హుస్సేనివాలా గ్రామం కోసం భారత్ పాకిస్థాన్‌కు ఏకంగా 12 గ్రామాలను ఇచ్చింది.
హుస్సేనివాలా గ్రామం స్వాతంత్ర్య సమరయోధుల బలిదానానికి, బ్రిటిష్ వారి క్రూరత్వానికి సాక్షిగా నిలిచింది. దేశం కోసం ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల సమాధులు ఇక్కడ ఉన్నాయి. దేశానికి స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని తీసుకురావాలనే తలంపుతో చిన్న వయసులోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధంలోకి దిగారు. 1928లో, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు లాహోర్‌లో బ్రిటిష్ జూనియర్ పోలీసు అధికారి జాన్ సాండర్స్‌ను కాల్చి చంపారు. ఈ నేరానికి బ్రిటిష్ సైనికులు ముగ్గురినీ అరెస్టు చేశారు. ఆ సమయంలో భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఈ కేసును విచారించడానికి ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి ముగ్గురికీ మరణశిక్ష విధించారు.
హుస్సేనివాలాలో అమరవీరుల అంత్యక్రియలు…
1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను లాహోర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు. ఈ ఘటనపై దేశ ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో బ్రిటిష్ పాలకులు భయపడి, ఎవరికీ తెలియకుండా ఉండటానికి రహస్యంగా ముగ్గురి మృతదేహాలను హుస్సేనివాలా గ్రామానికి తీసుకువచ్చి దహనం చేయడం ప్రారంభించారు. విషయం గ్రామస్థులకు తెలియడంతో వారు పెద్ద సంఖ్యలో దహన సంస్కార స్థలంలో గుమిగూడటం ప్రారంభించారు. అంతకంతకు గ్రామస్థుల సంఖ్య పెరుగుతుండటం చూసి బ్రిటిష్ సైనికులందరూ సగం కాలిపోయిన స్థితిలో మృతదేహాలను వదిలివేసి అక్కడి నుంచి పారిపోయారు. తరువాత గ్రామస్థులు మృతదేహాలను దహనం చేసి, ముగ్గురు ధైర్యవంతులైన వీరుల కోసం ఒక సమాధిని నిర్మించారు.
విభజన సమయంలో పాక్‌లో కలిసిన గ్రామం..
1947 విభజన సమయంలో ఈ గ్రామం పాకిస్థాన్‌కు వెళ్లింది. ఎవరూ దాని గురించి ఆలోచించలేదు. స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత, అమరవీరుల కుటుంబాలు, ప్రజలు భారత ప్రభుత్వాన్ని దానిని తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు కూడా లేఖలు రాశారు. 1961లో పండిట్ నెహ్రూ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని హుస్సేనివాలా గ్రామాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిగా ఫజిల్కా సమీపంలోని సరిహద్దుకు ఆనుకుని ఉన్న 12 గ్రామాలను వదులుకుంటామన్నారు. ఈ ఒప్పందానికి పాక్ అంగీకరి.. హుస్సేనివాలా గ్రామాన్ని భారత్‌కు ఇచ్చి బదులుగా 12 గ్రామాలను తీసుకుంది.
1973లో అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి జ్ఞాని జైల్ సింగ్ హుస్సేనివాలాలో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు జ్ఞాపకార్థం ఒక గొప్ప స్మారక చిహ్నాన్ని నిర్మించారు. నాటి నుంచి ప్రతి సంవత్సరం మార్చి 23న ఇక్కడ అమరవీరుల ఉత్సవం నిర్వహిస్తున్నారు.
READ MORE: Bengaluru cylinder blast: బెంగళూరులో విషాదం.. పదేళ్ల బాలుడు మృతి.. తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లు