Asia Cup Rising Stars 2025: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో టీమిండియా ఆట ముగిసింది. శుక్రవారం బంగ్లాదేశ్ ఎతో జరిగిన ఉత్కంఠభరితమైన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఎ సూపర్ ఓవర్‌లో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఎ 194 పరుగులు చేసింది. గెలుపు కోసం బరిలోకి దిగిన టీమిండియా కూడా 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. కానీ సూపర్ ఓవర్‌లో భారత్ క్రికెటర్లు చేతులెత్తేసి విజయాన్ని అందుకోలేకపోయారు. సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగింది. అనంతరం బరిలోకి దిగిన బంగ్లా వైడ్ బాల్ ద్వారా విజయానికి అవసరమైన ఒక పరుగును సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
READ ALSO: Smriti Mandhana Haldi: స్మృతి మంధాన ఇంట్లో పెళ్లి బాజాలు.. మొదలైన హల్దీ సెలబ్రేషన్స్
బంగ్లాదేశ్ విధ్వంసక బ్యాటింగ్..
దోహాలోని వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఎ జట్టు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. ఓపెనర్ హబీబుర్ రెహమాన్ కేవలం 46 బంతుల్లో 65 పరుగులు చేయగా, మరొక ఓపెనర్ జీషన్ ఆలం 14 బంతుల్లో 26 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. అయితే మిడిల్ ఓవర్లలో ఇండియా ఎ జట్టు బలంగా పుంజుకుంది. దీంతో బంగ్లా జట్టు 16.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 130 పరుగులు మాత్రమే చేసింది. కానీ ఆ తర్వాత ఎస్.ఎం. మెహ్రోబ్ హసన్ మైదానంలోకి దిగడంతో తన బ్యాట్‌తో ఒక్కసారిగా తుఫాన్ సృష్టించాడు. ఈ బ్యాట్స్‌మన్ కేవలం 18 బంతుల్లోనే 48 పరుగులు (6 సిక్సర్లు, 1 ఫోర్) చేశాడు. ఇది బంగ్లాదేశ్ ఎ జట్టు 194 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయపడింది. ఇండియా ఎ తరఫున గుర్జపానీత్ సింగ్ రెండు వికెట్లు, స్పిన్నర్ సుయాష్ శర్మ తన నాలుగు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
వైభవ్ – ప్రియాంష్‌ల సూపర్ బ్యాటింగ్
వైభవ్ సూర్యవంశీ మరోసారి టీమిండియాకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. వైభవ్ మొదటి ఓవర్లోనే 19 పరుగులు చేశాడు. మొదటి ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన తర్వాత, వైభవ్ రెండో ఓవర్లో మరో రెండు బాదాడు, దీంతో టీమిండియా 3.1 ఓవర్లలో 50 పరుగులకు చేరుకుంది. అదే ఓవర్లో వైభవ్ (38 పరుగులు, 15 బంతులు) అవుట్ అయినప్పటికీ, ప్రియాంష్ ఆర్య (44 పరుగులు, 23 బంతులు) సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించి ప్రత్యర్థి జట్టుపై ఎదురుదాడికి దిగాడు. ప్రియాంష్ 10వ ఓవర్లో అవుట్ అయ్యే ముందు జట్టును 98 పరుగులకు తీసుకెళ్లాడు. అనంతరం కెప్టెన్ జితేష్ శర్మ గెలుపు బాధ్యతను స్వీకరించి, నెహాల్ వధేరాతో కలిసి జట్టును 150 పరుగులకు చేర్చాడు. అయితే 15వ ఓవర్ చివరి బంతికి జితేష్ అవుట్ అవ్వడంతో బంగ్లాదేశ్ తిరిగి పోటీలోకి వచ్చింది. చివరి ఓవర్లో గెలవడానికి 16 పరుగులు అవసరం అయిన క్రమంలో అశుతోష్ శర్మ మూడవ బంతికి సిక్స్ కొట్టాడు. తరువాతి బంతికి అతను ఫోర్ కొట్టాడు. రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరం అయిన సందర్భంలో అశుతోష్ బౌల్డ్ అయ్యాడు.
చివరి బంతికి టై ..
చివరి బంతికి బ్యాటింగ్‌కు వచ్చిన హర్ష్ దుబే ఫీల్డర్ వైపు నేరుగా షాట్ ఆడాడు, కానీ రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక్కడే బంగ్లాదేశ్ కీపర్ రనౌట్‌కు ప్రయత్నించి తప్పు చేశాడు. ఈ తప్పును భారత బ్యాట్స్‌మెన్ సద్వినియోగం చేసుకుని మూడవ పరుగు పూర్తి చేశాడు. దీంతో మ్యాచ్ టై అయింది. తర్వాత జరిగిన సూపర్ ఓవర్‌లో ఇండియా ఎ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ జితేష్ శర్మ మొదట బ్యాటింగ్ చేశాడు. అయితే జితేష్ మొదటి బంతికే బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన అశుతోష్ కూడా రెండవ బంతికే క్యాచ్ ఇచ్చాడు. దీంతో సూపర్ ఓవర్‌లో ఇండియా ఎ జట్టు ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. బంగ్లాదేశ్ జట్టుకు గెలుపు సొంతం చేసుకోడానికి కేవలం ఒక పరుగు మాత్రమే అవసరం. అయితే బరిలోకి దిగిన బంగ్లా జట్టు మొదటి బంతికే ఒక వికెట్ కోల్పోయింది. ఈ వికెట్‌ను సుయాష్ శర్మ తీసుకున్నాడు. అయితే ఈ బౌలర్ నెక్ట్స్ బాల్ వైడ్ అయింది. దీంతో ఒక పరుగు రావడంతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.
READ ALSO: New Labour Laws 2025: దేశ వ్యాప్తంగా తక్షణమే అమల్లోకి నాలుగు లేబర్ కోడ్‌లు..
