దేశంపై మరోసారి కరోనా మహమ్మారి తన పంజా విసురుతోంది. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని పలువురు నిపుణులు చెప్తున్నారు. తాజాగా అహ్మదాబాద్ ఐఐఎం వెల్లడించిన నివేదిక సంచలనం రేపుతోంది. ఈ నివేదిక ప్రకారం… దేశంలో ఇప్పటివరకు సంభవించిన కరోనా మరణాలపై కేంద్ర ప్రభుత్వం లెక్కలకు, వాస్తవ లెక్కలకు వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. దేశంలో అధికారిక లెక్కల ప్రకారం కరోనా మరణాలు ఐదు లక్షలు ఉంటే… వాస్తవానికి దీని కంటే 6-7 రెట్లు అధికంగా ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది.
2021 సెప్టెంబర్ నాటికి దేశంలో కరోనా మరణాలు 31-34 లక్షల వరకు ఉండొచ్చని అహ్మదాబాద్ ఐఐఎం నివేదిక అంచనా వేసింది. గతంలో డెల్టా వేరియంట్ ప్రభావం వల్ల రోజువారీ కేసుల సంఖ్య అత్యధికంగా 4 లక్షలకు చేరింది. దీంతో కోట్లాది మంది ప్రజలు కరోనా కారణంగా ఆస్పత్రుల పాలయ్యారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ దొరక్క విలవిలలాడిపోయారు. ఆ సమయంలో కెనడాలోని యూనివర్శిటీ ఆఫ్ టొరంటోకు చెందిన ప్రొఫెసర్ ప్రభాత్ ఝా నేతృత్వంలో జరిగిన అహ్మదాబాద్ ఐఐఎం ఈ సర్వేను నిర్వహించింది.
