India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!

India Alliance Meeting

India Alliance Meeting

India Meet: కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాట వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి నేడు ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి కూటమిలోని 23 భాగస్వామ్య పక్షాలు హాజరవుతున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ వెల్లడించారు.

అయితే ఈ సమావేశానికి కీలక భాగస్వామ్య పక్షాలైన డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గైర్హాజరవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాము ఇకపై ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షం కాదని ఆప్ స్పష్టం చేయగా, కాంగ్రెస్ పార్టీ పాల్గొనే సమావేశాలకు హాజరుకాబోమని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రకటించింది. ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో కాంగ్రెస్ చేరడాన్ని డీఎంకే ‘వెన్నుపోటు’గా అభివర్ణించింది. అయితే ఇండియా కూటమిలోని ఇతర పార్టీలతో తమ సహకారం కొనసాగుతుందని డీఎంకే పేర్కొంది.

×
×
Ad

మరోవైపు సీపీఎం కూడా కాంగ్రెస్‌తో ఏర్పడిన విభేదాలను ప్రస్తావించడంతో పాటు తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా వంటి పక్షాలు గత సమావేశాలకు పలుమార్లు గైర్హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయినప్పటికీ కూటమిలో అంతర్గత వైరుధ్యాలు, రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నా ప్రజా సమస్యలపై సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయంతో మిగిలిన పక్షాలు సమావేశంలో పాల్గొంటున్నాయి.

జూలైలో జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం రెండు కీలక రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రతిపక్షాలు చర్చించనున్నాయి. అలాగే పార్లమెంట్‌లోపల, వెలుపల ప్రభుత్వంపై సమన్వయంతో పోరాటం నిర్వహించడంపై కార్యాచరణను ఖరారు చేయనున్నారు.

సమావేశంలో ‘సర్’ (SIR) ప్రక్రియ ద్వారా ఓటు హక్కులపై ప్రభావం, రాజ్యాంగ విలువల పరిరక్షణ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, యువత ఆశలు-ఆకాంక్షలపై ప్రభుత్వ వైఖరి, పెట్టుబడుల ఆకర్షణలో ఎదురవుతున్న సవాళ్లు, విదేశాంగ విధానాలు వంటి పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో బృహత్తర ఉద్యమాలను చేపట్టేందుకు కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు సమాచారం.

ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజవాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ (పవార్ వర్గం) నేత సుప్రియా సూలే, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, శివసేన (ఉద్ధవ్ వర్గం), జేఎంఎం సహా పలు ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు.