Ind Vs Pak: కాటేరమ్మ కొడుకు దూకుడు.. పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ పూర్తి..

Abhishek Sharma

Abhishek Sharma

మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భాగంగా దోహాలోని వేదికగా జరిగిన ఇండియా-ఎ, పాకిస్థాన్-ఎ మధ్య ఎనిమిదో మ్యాచ్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. టాస్ గెలిచిన పాకిస్థాన్-ఎ కెప్టెన్ అబ్దుల్ సమద్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్లు షమీల్ హుస్సేన్, మాజ్ సదాకత్ దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించారు. షమీల్ (33)ను ఆయుష్ బదోని అవుట్ చేయగా, ఆ తర్వాత మాజ్ సదాకత్ (59) అర్ధశతకం పూర్తి చేసుకుని 19వ ఓవర్‌లో పెవిలియన్ చేరారు.

మధ్య ఓవర్లలో హసన్ నవాజ్ 82 బంతుల్లో 79 పరుగులతో మెరవగా, చివర్లో ఫర్హాన్ యూసుఫ్ 48 బంతుల్లో 56 పరుగులతో వేగంగా ఆడి జట్టు స్కోరు 300 దాటించారు. అయితే వరుస వికెట్లు పడటంతో పాకిస్థాన్-ఎ 49.2 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, విప్రజ్ నిగమ్, ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గే తలా రెండు వికెట్లు పడగొట్టారు.

314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఎకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఐదు ఓవర్లలోపే వైభవ్ సూర్యవంశీ (11), ఆయుష్ బదోని (0) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడైన షాట్లతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. 8వ ఓవర్‌లో మొహమ్మద్ ఇమ్రాన్ రంధావా బౌలింగ్‌లో వరుస బౌండరీలు, సిక్సర్లతో జట్టు స్కోరును 50 దాటించారు.

ఫీల్డింగ్‌లో తలకు, ఆపై బ్యాటింగ్‌ సమయంలో 11వ ఓవర్‌లో మోచేతికి గాయమైనప్పటికీ కెప్టెన్ తిలక్ వర్మ క్రీజులో నిలదొక్కుకున్నారు. సిక్సర్‌తో అర్ధశతకం పూర్తి చేసిన అభిషేక్ శర్మ ధాటిగా ఆడుతుండగా, 14.2 ఓవర్లలో ఇండియా-ఎ 82/2 వద్ద నిలిచింది. విజయానికి ఇంకా 232 పరుగులు అవసరం కాగా, సెమీఫైనల్ రేసులో నిలవడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది.