Rising Stars Asia Cup 2026 షెడ్యూల్ విడుదల.. భారత్‌-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

India A Vs Pakistan A

India A Vs Pakistan A

Rising Stars Asia Cup 2026: క్రికెట్ ప్రేమికులకు మరోసారి హై-వోల్టేజ్ మ్యాన్యాకిల్ పోరు చూసే అవకాశం రాబోతోంది. మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్‌లో మరోసారి భారత్-పాకిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. దోహా వేదికగా జరగనున్న ఈ టోర్నమెంట్‌కు సంబంధించి ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇండియా-ఏ, పాకిస్థాన్‌-ఏ జట్లను ఒకే గ్రూప్‌లో ఉంచడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటుండగా, వాటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-ఎ లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు ఉండగా.. గ్రూప్-బి లో ఇండియా-ఏ, పాకిస్థాన్‌-ఏ, నేపాల్, యూఏఈ జట్లకు చోటు దక్కింది. ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగతా జట్లతో తలా ఒక మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ దశ ముగిశాక రెండు గ్రూప్‌ల నుంచి టాప్-2 చొప్పున జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. నవంబర్ 26, 27 తేదీల్లో సెమీఫైనల్స్ జరగనుండగా.. నవంబర్ 29న తుది పోరు (ఫైనల్) నిర్వహించనున్నారు.

ఇండియా-ఏ జట్టు తన తొలి మ్యాచ్‌లో నవంబర్ 20న నేపాల్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆ తర్వాత అందరూ ఆసక్తిగా ఎదురుచూసే దాయాదుల పోరు నవంబర్ 22న వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇక గ్రూప్ దశలో తన చివరి మ్యాచ్‌ను నవంబర్ 24న యూఏఈతో ఇండియా-ఏ ఆడుతుంది. టోర్నమెంట్‌లోని మెజారిటీ మ్యాచ్‌లు, అలాగే ఫైనల్ మ్యాచ్‌ను కూడా వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే నిర్వహిస్తారు. కొన్ని మ్యాచ్‌లకు మాత్రం యూనివర్సిటీ ఆఫ్ దోహా ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్రికెట్ గ్రౌండ్ వేదిక కానుంది. నవంబర్ 19న ఇదే మైదానంలో టోర్నమెంట్ తొలి మ్యాచ్ జరుగుతుంది.

గతేడాది జరిగిన టోర్నమెంట్‌ను ఒక్కసారి గుర్తుచేసుకుంటే.. 2025 ఏషియా కప్ రైజింగ్ స్టార్స్‌లో ఇండియా-ఏ జట్టుకు జితేశ్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించగా, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నమెంట్‌లో యూఏఈని 148 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత్ అద్భుతమైన ఆరంభాన్ని సాధించింది. అయితే తర్వాతి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఒమన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించినా.. బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించలేకపోయింది. మరోవైపు పాకిస్థాన్‌-ఏ జట్టు ఫైనల్‌లో సూపర్ ఓవర్ ద్వారా బంగ్లాదేశ్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు 2026 ఎడిషన్‌లో గత పరాజయాల నిరాశను వెనక్కి నెట్టి, పాకిస్థాన్‌‌తో జరిగే మ్యాచ్‌లో తమ సత్తా చాటడానికి ఇండియా-ఏ జట్టు ఉత్సాహంగా సిద్ధమవుతోంది.