టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన తర్వాత భారత జట్టు అత్యంత స్వల్ప ఫార్మాట్‌లో విజయాన్ని నమోదు చేయలేకపోయింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో భారత టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా వరుసగా రెండు సిరీస్‌లలో చారిత్రక ఓటములను చవిచూసింది. ఐర్లాండ్‌లో రెండు, ఇంగ్లండ్‌లో నాలుగు టీ20 మ్యాచ్‌లలో భారత్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో జులై 23 గురువారం నుంచి జింబాబ్వే పర్యటనలో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
ఈ సిరీస్ ప్రారంభానికి ముందు జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా భారత జట్టును హెచ్చరించారు. తమ జట్టును తక్కువ అంచనా వేస్తే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని వ్యాఖ్యానించారు. భారత జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉందని, ఈ సిరీస్ ఏకపక్షంగా సాగదని, ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయని రజా ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లపై సాధించిన విజయాలు తమకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని చెప్పారు. ఇండియాను ఓడించే ప్లాన్స్ మా దగ్గర ఉన్నాయని పేర్కొన్నాడు.
ఇంగ్లండ్ పర్యటనలో ఆకట్టుకోలేకపోయిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌లో తన ప్రతిభను చాటుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇక ఈ పర్యటనకు సంజూ శాంసన్ దూరం కాగా, ఐపీఎల్ 2026లో మెరిసిన వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు జట్టులో చోటు లభించింది. సెలెక్టర్లు తొలిసారిగా వేగవంతమైన బౌలర్లు యశ్ ఠాకూర్, అశోక్ శర్మలతో పాటు స్పిన్నర్ హర్ష్ దూబేను జట్టులోకి తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తి గాయపడటంతో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చారు.
భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, రింకూ సింగ్, మయాంక్ యాదవ్ తదితరులు ఉన్నారు. మరోవైపు సికందర్ రజా నేతృత్వంలో బ్రయాన్ బెన్నెట్, రిచర్డ్ నగారావా, బ్లెస్సింగ్ ముజరబానీ వంటి బలమైన ఆటగాళ్లతో జింబాబ్వే సిద్ధమైంది.

