IND vs ZIM 2nd T20: సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే.!

Teamindia

Teamindia

IND vs ZIM 2nd T20: జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను 7 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచిన టీమిండియా.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్, జింబాబ్వే మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు (జూలై 25)న హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్ కూడా ఇదే మైదానంలో జరిగింది.

తొలి మ్యాచ్‌లో భారత పేసర్లు ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా మయాంక్ యాదవ్ తొలి బంతికే వికెట్ తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగా, మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో జింబాబ్వేను కేవలం 125 పరుగులకే పరిమితం చేశారు. అదే ఊపును రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ తొలి టీ20లో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా కనిపించింది. ప్రారంభ ఓవర్లలో పిచ్‌లో తేమ ఉండటంతో బంతి స్వింగ్ అవుతూ మంచి బౌన్స్ లభించింది. దీంతో బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టంగా మారింది. రెండో టీ20లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉండవచ్చు. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తొలి టీ20లో భారత విజయంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి టీమిండియాకు సునాయాస విజయాన్ని అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. దీంతో రెండో మ్యాచ్‌లో కూడా అతని బ్యాటింగ్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక తొలి మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇటీవల ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రెండో టీ20లో అతని స్థానంపై చర్చ జరుగుతోంది.

రెండో టీ20లో భారత జట్టులో ఒకే ఒక్క మార్పు జరిగే అవకాశం ఉండవచ్చు. ఫామ్‌లో లేని అభిషేక్ శర్మ స్థానంలో పంజాబ్ కింగ్స్ వికెట్‌కీపర్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌కు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ప్రభ్‌సిమ్రన్, వరుసగా రెండో సీజన్‌లో 500కు పైగా పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. మిగతా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. అయితే యువ పేసర్ యశ్ ఠాకూర్‌కు అరంగేట్రం చేసే అవకాశం దక్కుతుందా అన్నది ప్రశ్నార్ధకం.

టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టాస్ ఓడిపోలేదు. భారత జట్టుకు నాయకత్వం వహించిన ప్రతి టీ20లో టాస్ గెలిచిన అయ్యర్.. రెండో టీ20లో కూడా అదే రికార్డును కొనసాగిస్తే అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోనున్నాడు. తొలి మ్యాచ్ విజయంతో భారత్ ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. అలాగే కెప్టెన్‌గా అయ్యర్‌కు ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయం కానుంది.

భారత్ (ప్లేయింగ్ XI):

వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (W), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (C), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.