Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..

Daren Samn

Daren Samn

ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్‌తో జరగనున్న నాలుగో టీ-20 అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు వెస్టిండీస్ ప్రధాన కోచ్ డెరెన్ సామీ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. భారత జట్టును స్వదేశంలోనే ఓడించడానికి తమ వ్యూహాన్ని వివరించారు. ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం రెండు, ఒకటి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. నాలుగో మ్యాచ్‌కు సన్నాహకంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్‌ను వారి సొంత గడ్డపై ఓడించాలంటే పవర్‌ప్లే పట్టు సాధించడం అత్యంత కీలకమని సామీ స్పష్టం చేశారు. మొదటి ఆరు ఓవర్లలో తమ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం వల్లే ప్రతి మ్యాచ్‌లోనూ తాము ఆరంభంలో వెనుకబడి, ఆ తర్వాత ఒత్తిడికి గురికావాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో పవర్‌ప్లే సమయంలో భారత బ్యాటర్లు సుమారు పద్నాలుగున్నర పరుగుల రన్ రేట్‌తో పరుగులు రాబట్టగా.. ఆ తర్వాత దశల్లో విండీస్ బౌలర్లు భారత రన్ గతిని పది లోపునకు కట్టడి చేయగలిగారని పేర్కొన్నారు.

అయితే ఆరంభంలో జరిగిన ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి తమ బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరూ పవర్‌ప్లేను కచ్చితంగా వినియోగించుకోవాలని తెలిపారు. ప్రస్తుత సిరీస్‌లో తమ బ్యాటింగ్ ప్రదర్శన భారత్ కంటే మెరుగ్గా ఉందని, కొన్ని సందర్భాల్లో తాము ప్రత్యర్థి కంటే ఎక్కువ సిక్సర్లు కూడా బాదామని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం పిచ్‌లు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతున్నందున, రెండు వందల కంటే ఎక్కువ స్కోర్లు సాధారణంగా మారిపోయాయని, అందుకే ప్రత్యర్థిని పెద్ద స్కోర్ల వరకు వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. కేవలం షాయ్ హోప్ మీద మాత్రమే తమ జట్టు బ్యాటింగ్ ఆధారపడి లేదని.. ఆయన నిలకడగా ఆడుతున్నప్పటికీ, ఇతర ఆటగాళ్లు కూడా బాధ్యతాయుతంగా రాణించాలని సామీ సూచించారు.