Site icon NTV Telugu

IND vs UAE: యూఏఈతో మ్యాచ్.. ప్లేయింగ్ 11పై హింట్ ఇచ్చేసిన బౌలింగ్‌ కోచ్!

Teamindia

Teamindia

India Playing 11 vs UAE: ఆసియా కప్‌ 2025 నిన్న ఆరంభమైంది. టోర్నీని అఫ్గానిస్థాన్‌ ఘన విజయంతో మొదలు పెట్టింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో 94 పరుగుల తేడాతో హాంకాంగ్‌ను చిత్తుగా ఓడించింది. నేడు భారత్ తన తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా రాత్రి 8 గంటలకు యూఏఈని ఢీకొట్టనుంది. కీలక పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు సన్నాహకంగా ఈ పోరును వాడుకోవాలని టీమిండియా చూస్తోంది. అయితే టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. బౌలింగ్‌ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్లేయింగ్ 11పై హింట్ ఇచ్చాడు.

‘దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడాం. అనంతరం ఇక్కడ చాలా మ్యాచులు జరిగాయి. ఇప్పుడు పిచ్‌ స్పందించే తీరు మారిపోయే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ముందు పిచ్‌ను చూసి ఓ అంచనాకు వస్తాం. ప్రస్తుతం పిచ్‌పై కొద్దిగా పచ్చిక ఉంది. యూఏఈ మ్యాచ్‌లో ఎలా బరిలోకి దిగాలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది. అత్యుత్తమ జట్టును బరిలోకి దించుతాం. అదనపు పేసర్‌ లేదా స్పిన్నర్‌ అనేది మ్యాచ్‌కు ముందు నిర్ణయిస్తాం’ అని బౌలింగ్‌ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు.

‘ఆసియా కప్‌ 2025లో గేమ్ ఛేంజర్ కుల్దీప్ యాదవే. అతడు తన కెరీర్‌లో ఎన్నో ఓవర్లు వేశాడు. టీ20ల్లో ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కుల్దీప్ స్పెషల్ బౌలర్ అనే చెబుతా. అతడు ప్రొఫెషనల్ అథ్లెట్. ఇంగ్లండ్‌ పర్యటనలో ఛాన్స్ రాకపోయినా అతడి యాటిట్యూడ్ మాత్రం అలానే ఉంది. ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకొనేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆసియా కప్‌లో రాణిస్తాడు అని నా నమ్మకం’ అని మోర్నీ మోర్కెల్ పేరొన్నాడు.

మోర్నీ మోర్కెల్ వ్యాఖ్యలను బట్టి చూస్తే తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటు పక్కాగా కనిపిస్తోంది. ఆల్‌రౌండర్ కోటాలో అక్షర్ పటేల్‌.. స్పెసలిస్ట్ స్పిన్నర్ కోటాలో వరుణ్ చక్రవర్తి ఆడనున్నారు. కుల్దీప్ యాదవ్‌ను కూడా తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్‌ సింగ్ పేసర్లుగా తుది జట్టులో ఉంటారు. పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యా ఉంటాడు. ఇద్దరు ఆల్‌రౌండర్లు, నలుగురు బౌలర్లు జట్టులో ఉంటారు. ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాటర్లు ప్లేయింగ్ 11లో ఉంటారు. అభిషేక్, గిల్, తిలక్, సూర్య, శాంసన్ లేదా జితేష్ ఆడనున్నారు.

 

Exit mobile version