NTV Telugu Site icon

Asia Cup Final 2023: ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, శ్రీలంక.. గణాంకాలు చూస్తే టీమిండియాకు ఓటమి తప్పేలా లేదు!

Ind Vs Sl

Ind Vs Sl

Asia Cup Final Stats Scare India: ఆసియా కప్ 2023 టైటిల్ పోరుకు అంతా సిద్ధమైంది. ఫైనల్‌లో శ్రీలంకను ఢీకొట్టేందుకు భారత్‌ సిద్ధమైంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోలోని ఆర్.ప్రేమదాస మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన భారత్, శ్రీలంకలు టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఆసియా కప్ టోర్నీలో ప్రదర్శనను బట్టి చూస్తే.. రోహిత్‌ సేనే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌. కాకపోతే శ్రీలంకను ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

ప్రస్తుతం జరుగుతుంది ఆసియా కప్ 16వ ఎడిషన్. ఈ 16వ ఎడిషన్ ఫైనల్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌ అయినా గణాంకాలు మాత్రం టీమిండియాను భయపెడుతున్నాయి. ఆసియా కప్ చరిత్రలో శ్రీలంకపై మాత్రమే ఫైనల్‌లో భారత్ ఓడిపోయింది. గత 15 ఆసియా కప్ టోర్నీల్లో భారత్ మొత్తం 10 సార్లు ఫైనల్ ఆడగా.. మూడుసార్లు ఓడిపోయింది. ఆ మూడుసార్లు శ్రీలంకపైనే ఓడిపోవడం విశేషం. ఇదే ప్రస్తుతం రోహిత్ సేనను ఆందోళనకు గురిచేస్తోంది.

1984లో ఆసియా కప్ ఆరంభం కాగా.. తొలి ఎడిషన్‌లో శ్రీలంకను ఓడించిన భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 1988, 1991, 1995 ఫైనల్స్‌లో లంకను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. 1997లో టీమిండియాను ఓడించిన శ్రీలంక.. తొలిసారి ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది. 2004, 2008లో భారత్‌ను ఓడించి శ్రీలంక టైటిల్ గెలుచుకుంది. 2010 ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి భారత్ ట్రోఫీని అందుకుంది. ఆ తర్వాత జరిగిన ఫైనల్‌లో ఇరు జట్లు తలపడలేదు. 13 ఏళ్ల విరామం తర్వాత భారత్, శ్రీలంక జట్లు ఆసియా కప్‌లో ఫైనల్‌ పోరుకు సిద్ధమయ్యాయి.

Also Read: Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి!

ఇప్పటివరకు 8సార్లు ఫైనల్లో భారత్, శ్రీలంక తలపడగా.. టీమిండియాదే ఆధిపత్యం. అయితే శ్రీలంకలో జరిగిన రెండు ఫైనల్స్‌లోనూ భారత్ ఓడింది. ఇప్పుడు కూడా లంకలోనే మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ చిన్న పొరపాటు చేసినా ఓటమి తప్పదు.