Site icon NTV Telugu

Ind vs SA: దక్షిణాఫ్రికాతో భారత్‌ పోరు నేడే.. గ్రూప్‌లో అగ్రస్థానంపై కన్నేసిన జట్లు

Ind Vs Sa

Ind Vs Sa

Ind vs SA: టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఓడించి, పసికూన జట్టు నెదర్లాండ్స్‌ను మట్టి కరిపించి మంచి జోరు మీదున్న టీమిండియాకు గట్టి పోటీ ఎదురైంది. రోహిత్ సేన ఆదివారం కీలక సమరానికి సిద్ధమైంది. గ్రూప్‌లోని మిగతా జట్లలో అత్యంత బలమైన దక్షిణాఫ్రికాను టీమిండియా ఇవాళ ఢీకొంటోంది. లీగ్‌ దశలో చివరి రెండు మ్యాచ్‌లు బంగ్లాదేశ్, జింబాబ్వేలతోనే కాబట్టి బెంగ పడాల్సిందేమీ లేదు.. అటు రెండు మ్యాచ్‌లు, ఇటు రెండు మ్యాచ్‌ల మధ్య మరో కీలక సమరానికి భారత్‌ సన్నద్ధమైంది. పటిష్ట జట్టయిన దక్షిణాఫ్రికా మనకు సవాల్‌ విసురుతోంది. ఈ మ్యాచ్‌ నెగ్గితే టీమిండియాకు గ్రూప్‌లో అగ్రస్థానం మాత్రమే కాక సెమీస్‌ బెర్త్‌ కూడా దాదాపు ఖాయమవుతుంది. ఈ మ్యాచ్‌ ఓడితే నాకౌట్‌ బెర్తు కోసం మళ్లీ ఉత్కంఠ తప్పదు. భారత్‌ గెలిస్తే సెమీఫైనల్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోవడంతోపాటు గ్రూప్‌లో టాపర్‌గా నిలిచే అవకాశం కూడా ఉంది. బంగ్లాదేశ్‌తో పోరులో సఫారీలు చెలరేగిన తీరు హెచ్చరికే.. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో నిండిన ఆ జట్టుతో జాగ్రత్తగా ఉండాల్సిందే.

టీమిండియా ప్రదర్శన చూస్తే తుది జట్టులో మార్పులకు ఎలాంటి అవకాశం కనిపించడం లేదు. ఈ ప్రపంచకప్‌లో కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లో లేకపోవడం అతిపెద్ద ఆందోళనగా మారుతోంది. పాకిస్థాన్‌ కీలక పోరులోనే కాకుండా నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రాహుల్‌ ప్రదర్శన నిరాశజనకంగా ఉంది. ఈ నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌ను తప్పించి రిషబ్ పంత్‌ను ఆడించాలన్న డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ అలాంటిదేమీ లేదని స్పష్టం చేసేశాడు. పంత్‌ ఎడంచేతి వాటం అదనపు ప్రయోజనమే అయినా, రాహుల్‌కు మేనేజ్‌మెంట్‌ మరో అవకాశం ఇస్తోంది. ఈ మ్యాచ్‌లో అసలు సవాల్‌ భారత టాపార్డర్‌కు ఎదురు కానుంది. ఆదివారం అతడికి మరో అవకాశం ఇస్తారా.. లేక పంత్‌ వైపు చూస్తారా అన్నది ఆసక్తికరం.

నెదర్లాండ్‌ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీల ఊపు కొనసాగగా.. సూర్య తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. బౌలర్లలో షమి మంచి వేగంతో బౌన్స్ రాబట్టగలడు. పెర్త్‌ పిచ్‌ స్పిన్‌కు పెద్దగా సహకరించని నేపథ్యంలో అక్షర్‌ను పక్కన పెట్టి హర్షల్‌ను ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. పేసర్లు అర్ష్‌దీప్‌, భువి, షమి తొలి రెండు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శనే చేశారు. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న దక్షిణాఫ్రికాపై వీరి బౌలింగ్‌ ఎలా సాగుతుందో చూడాలి. దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడ, నోర్జే బౌలింగ్‌ను ఎదుర్కోవడంపైనే గెలుపు అవకాశాలు ఉన్నాయంటే తప్పులేదు. రబాడ, నోకియా ఎంగిడిలతో కూడిన పేస్‌ బౌలింగ్ కాబట్టి టీమిండియా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ ముగ్గురికి తోడు పార్నెల్‌ లేదా జాన్సన్‌ చేసే పేస్‌ దాడిని కాచుకోవడం అంత తేలిక కాదు. తమ బలానికి అనుగుణంగా నలుగురు స్పెషలిస్టు పేసర్లతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగొచ్చు. కేశవ్‌ ఒక్కడినే ఆడించి మరో స్పిన్నర్‌ షంసిని పక్కన పెట్టొచ్చు. భారత బ్యాట్స్‌మెన్‌ ఏ మేరకు వీరిని ఎదుర్కొంటారో చూడాల్సిందే.

దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో డికాక్‌, రొసో, మార్‌క్రమ్‌, మిల్లర్‌లతో భారత్‌ జాగ్రత్తగా ఉండాలి. బంగ్లాపై సెంచరీ చేసి ఊపుమీదున్నాడు రొసో. డికాక్‌, మిల్లర్‌ ఎప్పుడూ భారత్‌పై బాగా ఆడతారు. మార్‌క్రమ్‌ కూడా జోరు మీదే ఉన్నాడు. పేలవ ఫామ్‌తో సతమతం అవుతున్నప్పటికీ కెప్టెన్‌ కాబట్టి బవుమా జట్టులో కొనసాగుతున్నాడు. విమర్శలకు చెక్‌ పెట్టడం కోసం అతను కూడా పట్టుదలతో ఆడే అవకాశముంది. దక్షిణాఫ్రికా ప్రధాన బ్యాటర్లంతా దూకుడుగా ఆడగల సమర్థులే.

ఇదిలా ఉండగా.. టీమిండియా మ్యాచ్‌ ఆడుతుంటే పాకిస్థాన్‌ వాళ్లు ప్రార్థించడం ఎప్పుడైనా జరిగిందా.. అంటే ఈ ఆదివారం ఆ దృశ్యమే చూడబోతున్నాం. ఎందుకంటే పాక్‌ జట్టు సెమీస్‌ చేరడం భారత్‌ చేతుల్లోనే ఉంది. టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపై గెలిచి ఆ జట్ల సెమీస్‌ అవకాశాలను దెబ్బ తీస్తేనే పాక్‌ ముందంజ వేయడానికి అవకాశముంటుంది. భారత్‌, జింబాబ్వేల చేతుల్లో ఓడిన పాక్‌ ఇప్పుడు గ్రూప్‌-2లో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. మిగతా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సమీకరణాలు కలిసి వస్తేనే పాక్‌ సెమీస్‌ బెర్త్‌ చేరుకుంటుంది. అందుకే భారత్ గెలవాలని దాయాది జట్టు కోరుకుంటోంది. 5 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-దక్షిణాఫ్రికా తలపడ్డ మ్యాచ్‌లు. నాలుగుసార్లు భారత్‌ నెగ్గితే, ఒక్కసారే దక్షిణాఫ్రికా గెలిచింది. ఈ సారి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

Exit mobile version