NTV Telugu Site icon

IND vs SA: బీసీసీఐ అంత కాకపోయినా.. కవర్స్ కొనేంత డబ్బు దక్షిణాఫ్రికా వద్ద లేదా?

Sunil Gavaskar New

Sunil Gavaskar New

Sunil Gavaskar slams South Africa Cricket: భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. డర్బన్‌లో వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో టాస్‌ వేయడం కూడా సాధ్యం కాలేదు. ఒక్క బంతి కూడా పడకపోవడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై భారత మాజీ క్రికెటర్ సునీల్‌ గవాస్కర్‌ మండిపడ్డారు. మైదానం మొత్తాన్ని కప్పి ఉంచే కవర్స్ కొనేంత డబ్బు కూడా దక్షిణాఫ్రికా వద్ద లేదా? అని విమర్శించారు. మైదానాన్ని కవర్స్‌తో కప్పి ఉంచలేనందుకే వన్డే ప్రపంచకప్ 2019లో ఎన్నో మ్యాచ్‌లు రద్దు అయ్యాయని గుర్తు చేశారు.

స్టార్ స్పోర్ట్స్‌లో సునీల్‌ గవాస్కర్‌ మాట్లాడుతూ… ‘మైదానం మొత్తం కవర్స్ కప్పి ఉంచకపోతే.. వర్షం ఆగిన తర్వాత కూడా మ్యాచ్ ఆరంభానికి ఇంకో గంట ఎదురుచూడాల్సి ఉంటుంది. మరోసారి వర్షం కురిస్తే మ్యాచ్ కొనసాగదు. ఈ విషయం అందరికీ తెలుసు. అన్ని క్రికెట్ బోర్డులకు చాలా డబ్బు వస్తోంది. అన్ని క్రికెట్ బోర్డుల దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. డబ్బులు లేవని చెబితే అబద్ధం చెబుతున్నట్లే. బీసీసీఐ దగ్గర ఉన్నంత డబ్బు దక్షిణాఫ్రికా బోర్డు వద్ద లేకపోవచ్చు. కానీ మైదానంను కప్పి ఉంచే కవర్స్‌ను కొనేంత డబ్బు ఉంటుంది’ అని అన్నారు.

Also Read: Vrinda Dinesh: అమ్మకు వీడియో కాల్‌ కూడా చేయలేకపోయా: వ్రిందా

2019 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌లో వాతావరణం అందరినీ నిరాశపరిచిందని బ్యాటింగ్ ఐకాన్ సునీల్ గవాస్కర్ గుర్తుచేశారు. ‘మైదానంను కవర్స్‌తో కప్పి ఉంచలేనందుకే ప్రపంచకప్ 2019లో ఎన్నో మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. వర్షం ఆగినా అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో చాలా జట్లు పాయింట్లు కోల్పోయాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో శ్రీలంక ఆడాల్సిన మ్యాచ్‌లు వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దు చేయబడ్డాయి. వెస్టిండీస్‌తో దక్షిణాఫ్రికా తలపడినా ఫలితం రాలేదు. ఈడెన్ గార్డెన్స్ మైదానం మొత్తాన్ని కవర్స్‌తో కప్పి ఉంచుతారు. మ్యాచ్ జరిగేలా సిబ్బంది ఏర్పాట్లు చేస్తారు. ఈడెన్ మైదానాన్ని గొప్పగా చేయడానికి సౌరవ్ గంగూలీ కారణం’ అని గవాస్కర్ పేర్కొన్నారు.