NTV Telugu Site icon

Rohit Sharma: మా బ్యాటింగ్‌ చెత్తగా సాగింది.. బుమ్రాపైనే ఆధారపడితే పని జరగదు!

Rohit Sharma Tests

Rohit Sharma Tests

Rohit Sharma React on India Deeat vs South Africa in 1st Test: రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తమ బ్యాటింగ్‌ చెత్తగా సాగిందని, బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగానే తొలి టెస్టులో పరాజయం పాలైనట్లు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. తమ బౌలింగ్‌ పేలవంగా ఉందని, జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడితే పని జరగదన్నారు. కఠినమైన పిచ్‌లపై ఎలా ఆడాలో లోకేష్ రాహుల్‌ చూపించాడన్నాడు. సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఏకంగా ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మూడో రోజైన గురువారం163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్.. 131 పరుగులకే ఆలౌట్ అయింది.

మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ… ‘గెలుపు దిశగా మా ఆట తీరు సాగలేదు. కేఎల్‌ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి మాకు అవకాశాలు సృష్టించాడు. కానీ మేము వాటిని ఉపయోగించుకోలేకపోయాం. మేము బంతితో పరిస్థితులను ఉపయోగించుకోలేదు. ఈరోజు కూడా బ్యాటింగ్ చెత్తగా సాగింది. టెస్టు మ్యాచ్‌ గెలవాలంటే సమిష్టిగా రాణించాలి. కానీ ఈరోజు మేము అది చేయలేకపోయాం. ఎవరు ఎలాంటి పాత్ర పోషించాలన్న విషయం మీద ఆటగాళ్లకు ఓ అవగాహన ఉంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లు మా బ్యాటర్లకు అనుక్షణం సవాల్‌ విసిరారు. వారిపై పైచేయి సాధించలేకపోయాం’ అని అన్నాడు.

Also Read: Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్ర సర్కార్..

‘ఇది బౌండరీ స్కోరింగ్‌ గ్రౌండ్‌. దక్షిణాఫ్రికా బ్యాటర్లు బాగా బ్యాటింగ్‌ చేశారు. కానీ మేము అలా చేయలేకపోయాం. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మేం బాగా బ్యాటింగ్ చేయలేదు. అందుకే ఓడిపోయాం. ప్రత్యర్థి జట్టు బలాబలాలను సరిగ్గా అంచనా వేయలేకపోయాం. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ ముగిసేందుకు మేము ఆస్కారం ఇవ్వడం మంచి విషయం కాదు. మా బౌలర్లలో చాలా మంది ఇప్పుడే మొదటిసారిగా ఇక్కడి పర్యటనకు వచ్చారు. బుమ్రాపైనే ఆధారపడితే పని జరగదు. అతడికి సహకారం అందలి. ఓటమికి సాకులు వెదకాలనుకోవడం లేదు. తిరిగి పుంజుకుని తదుపరి మ్యాచ్‌ మీద దృష్టి పెడతాం’ అని రోహిత్ పేర్కొన్నాడు.