NTV Telugu Site icon

KL Rahul: ఇప్పుడే టాస్‌ పడి.. అంతలోనే మ్యాచ్‌ ముగిసినట్లు అనిపిస్తోంది!

Kl Rahul Test

Kl Rahul Test

KL Rahul React on Shortest Test in Cricket History at Cape Town: కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫాస్ట్ బౌలర్లు మొహ్మద్ సిరాజ్ (6/15), జస్ప్రీత్ బుమ్రా (6/61) చెలరేగడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 176 పరుగులకే పరిమితమైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 153 రన్స్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 80 పరుగులు చేసి గెలిచింది.

దక్షిణాఫ్రికా, భారత్ రెండో టెస్ట్ కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ముగిసింది. ఒకటిన్నర రోజుల్లోనే ఏకంగా 33 వికెట్స్ పడ్డాయి. ఈ టెస్టుపై క్రికెట్ మాజీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. భారత వికెట్ కీపర్‌ కేఎల్ రాహుల్ మాత్రం ఇదెలా సాధ్యమైందో అర్థం కావడం లేదన్నాడు. కేప్‌టౌన్‌లో గెలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అయితే ఇప్పుడే టాస్‌ పడి.. అంతలోనే మ్యాచ్‌ ముగిసినట్లు అనిపిస్తోందని రాహుల్ చెప్పాడు. మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ రెండో టెస్టుపై తన అభిప్రాయం తెలిపాడు.

‘కేప్‌టౌన్‌లో మొదటిసారి విజయం సాధించడం చాలా సంతోషకరమైన విషయం. దక్షిణాఫ్రికాలో ఇది నా మూడవ సిరీస్. మేము ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ గేమ్‌లో ఉంటాము. కానీ ఒక సెషన్‌లో బాగా బ్యాటింగ్ చేయనందుకు ఓడిపోయాము. అందుకే ఈ విజయంతో చాలా సంతోషంగా ఉన్నాం. ఈ విజయం మరెంతో ప్రత్యేకం. భావోద్వేగాలపరంగా ఇది ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడిప్పుడే టాస్‌ పడి.. మ్యాచ్‌ ముగిసినట్లు అనిపిస్తోంది’ అని లోకేష్ రాహుల్ చెప్పాడు.

Also Read: Redmi Note 13 Price: రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్ ధర, ఫీచర్లు ఇవే!

‘ పిచ్ ఇలా మారుతుందని అస్సలు అనుకోలేదు. బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురైంది. తొలి టెస్టులో మేము ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఓడిపోయాం. దీంతో సిరీస్‌ను గెలిచే అవకాశాలు కోల్పోయాం. అయితే సిరీస్‌ను సమం చేసే ఛాన్స్‌ మాత్రమే మా ముందుంది. దీంతో రెండో టెస్టు కోసం బాగా కష్టపడ్డాం. మా ప్రణాళికల్లో మార్పులు చేశాం. గత నాలుగైదేళ్లుగా విదేశాల్లోనూ గట్టి పోటీనిస్తున్నాం. కొన్ని సిరీస్‌లనూ గెలిచాం కూడా. టెస్టు క్రికెట్‌ ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తాం’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.