NTV Telugu Site icon

India vs Pakistan: వన్డే ప్రపంచకప్ 2023.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ రీ-షెడ్యూల్! కారణం ఏంటంటే?

Ind Vs Pak

Ind Vs Pak

IND vs PAK ODI World Cup 2023 Match Likely To Be Rescheduled As Navratri: వన్డే ప్రపంచకప్‌ 2023​​ భారత గడ్డపై జరగనున్న విషయం తెలిసిందే. 2011 తర్వాత భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగడం ఇదే తొలిసారి. మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ రిలీజ్ చేసింది. ఆక్టోబర్‌ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్‌ మ్యాచులు జరగనున్నాయి. ఆక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది.

క్రికెట్‌ అభిమానుల ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ రీ-షెడ్యూల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ఇండో-పాక్ మ్యాచ్ రోజునే నవరాత్రి ఉత్స‌వాల‌ మొదటి రోజు. నవరాత్రి తొలి రోజు ఉత్సవాలు మరియు వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ షెడ్యూల్‌ను మళ్లీ రూపొందించాలని భద్రతా సంస్థలు బీసీసీఐని కోరాయట. పండగ, మ్యాచ్ సందర్భంగా వేలాది మంది అహ్మదాబాద్ చేరుకుంటారని.. సెక్యూరిటీ కష్టమవుతుందని భద్రతా ఏజెన్సీలు పేర్కొంటున్నాయట. గుజ‌రాత్‌లో నవరాత్రి ఉత్స‌వాల‌ను గ్రాండ్‌గా నిర్వ‌హిస్తారన్న విషయం తెలిసిందే.

Also Read: Road Accident: రాఖీల కోసం వెళ్లి.. మృత్యు ఒడిలోకి చేరిన బాబాయ్, అమ్మాయి!

భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై ఉన్న అన్ని ఎంపికలను పరిశీలిస్తున్నామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్‌ 2023 మ్యాచ్‌లు నిర్వహించే అన్ని రాష్ట్ర సంఘాలను జూలై 27న జరిగే సమావేశానికి హాజరు కావాలని బీసీసీఐ కార్యదర్శి జే షా కోరారు. ఈ సమావేశంలో ఇండో-పాక్ మ్యాచ్‌పై ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం టికెట్స్, హోటళ్లు, లాడ్జ్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు మ్యాచ్ తేదీ మారితే.. ఆ ప్రభావం చాలా మంది అభిమానులపై పడనుంది. చాలా వ‌ర‌కు లాజిస్టిక్ స‌మ‌స్య‌లు ఎదురుకానున్నాయి. మరి బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ప్రపంచకప్‌ 2023లో 45 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు, 2 నాకౌట్‌ మ్యాచ్‌లు (సెమీ ఫైనల్స్‌), ఒక ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్నాయి. మొత్తం 48 మ్యాచ్‌లకు భారత్‌లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఢిల్లీ, లక్నో, పుణె, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా హైదరాబాద్‌, ధర్మశాల వేదికలుగా మ్యాచ్‌లు జరగనున్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరగనున్న ప్రపంచకప్ 2023లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి.

Also Read: Harmanpreet Kaur Suspended : టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌పై నిషేధం!

Show comments