Site icon NTV Telugu

IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్.. తెలుగోడు తిలక్ వర్మపై వేటు తప్పదా?

Tilak Varma

Tilak Varma

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా ఆసియా కప్‌ 2025 జరుగుతోంది. ఆతిథ్య హక్కులు భారత్ వద్దే ఉన్నా.. గతంలో పాకిస్తాన్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూఏఈలో టోర్నీ జరగుతోంది. బుధవారం పసికూన యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ రికార్డు విజయం సాధించి.. టోర్నీని ఘనంగా ఆరంభించింది. తర్వాతి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను భారత్ ఢీ కొట్టనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14 (ఆదివారం) జరగనుంది. పాకిస్థాన్‌పై విన్నింగ్ కాంబినేషన్‌తోనే దాదాపుగా భారత్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే పిచ్ పరిస్థితులు ప్రభావితం చేస్తే మాత్రం తెలుగోడు తిలక్ వర్మపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ కొనసాగుతారు. మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. కీపర్‌గా సంజూ శాంసన్ జట్టులో ఉంటాడు. బ్యాటింగ్ డెప్త్ కోసం పేస్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేతో యూఏఈపై భారత్ బరిలోకి దిగింది. దూబే (3/4) అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. దాంతో అతడు కొనసాగనున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి పక్కా. కుల్దీప్ నాలుగు వికెట్స్ పడగొట్టడంతో అంచనాలు పెరిగాయి. ఇక స్పెషలిస్ట్ పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నాడు.

Also Read: Shivam Dube: అతడు నా వెంట పడ్డాడు.. ఆసక్తికర విషయం చెప్పిన శివమ్ దూబే!

పిచ్ పరిస్థితుల నేపథ్యంలో ఎక్స్‌ట్రా స్పెషలిస్ట్ బౌలర్ అవసరం అయితే అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు తిలక్ వర్మ, వరుణ్ చక్రవర్తిలలో ఒకరిపై వేటు పడుతుంది. స్పిన్‌కు అనుకూలంగా ఉండే దుబాయ్ పిచ్‌పై ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువ. పేసర్ అవసరం అయితేనే జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంటుంది. లేదంటే యూఏఈపై ఆడిన జట్టే పాకిస్థాన్‌తో ఆడుతుంది. పాక్ మ్యాచ్ కాబట్టి బ్యాటింగ్ బలంగా ఉండాలంటే తిలక్ తుది జట్టులో తప్పక ఉండాల్సిందే. చూడాలి మరి కెప్టెన్ సూర్య ఏ నిర్ణయం తీసుకుంటాడో.

Exit mobile version