భారత్, పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున ఎగబడతారు. దాయాదులు బరిలోకి దిగినప్పుడు ఏ స్టేడియం అయినా నిండిపోతుంది. ఈ క్రమంలోనే ఇండో-పాక్ మ్యాచ్ టిక్కెట్లకు ఉండే క్రేజ్ మరో లెవల్లో ఉంటుంది. టికెట్స్ రిలీజ్ చేసిన క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోతుంటాయి. అయితే ఈసారి పరిస్థితి కాస్త బిన్నమైనా.. చివరకు భారీ ప్రైజ్ టికెట్స్ కూడా మొత్తం అమ్ముడుపోయాయి. రూ.4 లక్షల టికెట్స్ కూడా ఇప్పుడు అందుబాటులో లేవు.
ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ కారణంగా మ్యాచ్ జరుగుతుందో లేదో అనే అనుమానాలు ఇటీవలి రోజులో నెలకొన్నాయి. బాయ్‌కాట్ ఆసియా కప్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దాంతో మ్యాచ్ టికెట్లపై ప్రభావం పడింది. ఆగష్టు 29న టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయినా.. 3-4 రోజుల క్రితం వరకు సగానికి పైగా టికెట్స్ సేల్ కాలేదు. మ్యాచ్ రద్దు చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టులో కూడా ఓ పిల్ దాఖలైంది. ఇది కేవలం ఆట అని సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. మ్యాచ్‌పై నీలినీడలు తొలగిపోవడంతో టికెట్స్ అమ్మకాలు జోరందుకున్నాయి.
Also Read: Asia Cup 2025: పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు.. భారత జట్టును వీడిన స్టార్ ప్లేయర్!
నాలుగు రోజుల క్రితం వరకు సగం టికెట్స్ ఉన్నప్పటికీ.. ఈరోజు అన్ని సేల్ అయిపోయాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే.. అత్యధిక ధర ఉన్న స్కై బాక్స్ టికెట్స్ (4534 usd-రూ.4 లక్షలు) కూడా అమ్ముడయ్యాయి. గురువారం రాత్రి 9 గంటల వరకు ప్రీమియం టికెట్స్ దాదాపు 50 శాతం అందుబాటులో ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకల్లా అన్ని అమ్ముడయ్యాయి. ఇందులో రెండు సీట్లు ఉండనున్నాయి. ఫుడ్, డ్రింక్స్, వీఐపీ క్లబ్, లాంజ్ ఎంట్రీ, ప్రైవేట్ ఎంట్రన్స్, పార్కింగ్ పాస్ వంటి సౌకర్యాలు ఇందులో ఉంటాయి. ప్రారంభ టికెట్ ధర $99 (సుమారు Rs 8738)గా ఉంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం 25,000 మంది సామర్థ్యం కలిగి ఉంది.
