NTV Telugu Site icon

IND vs NZ Semi Final 2023: భారత్, న్యూజిలాండ్‌ సెమీస్‌ మ్యాచ్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!

Ind Vs Nz Cwc 2023 Semi Finals

Ind Vs Nz Cwc 2023 Semi Finals

India vs New Zealand Head To Head Records in ODI: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం వాంఖడే మైదానంలో న్యూజిలాండ్‌తో జరగనున్న సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో 9 మ్యాచ్‌లకు 9 గెలిచి ఓటమెరుగని జట్టుగా సెమీస్ చేరిన టీమిండియా.. అదే జోరులో కివీస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాలనుకుంటోంది. 2019 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభావానికి ప్రతీకారం కూడా తీర్చుకోవాలనుకుంటోంది. మరోవైపు భారత్‌ను ఓడించి అందని ద్రాక్షగా ఉన్న వన్డే ప్రపంచకప్‌కు మరింత చేరువ కావాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది.

భారత్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు వేదిక అయిన వాంఖడే మైదానం బ్యాటింగ్‌కు అనుకూలం. నేడు జరుగబోయే సెమీస్‌ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారడం ఖాయం. వాంఖడే స్టేడియం చిన్నది కావడంతో బ్యాటర్లు సునాయాసంగా సిక్సర్లు, ఫోర్లు బాదగలరు. ఇదే పిచ్‌పై శ్రీలంకతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 357 పరుగులు చేసింది. ఆపై శ్రీలంకను 55 పరుగులకే ఆలౌట్‌ చేసి.. 302 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఇక్కడ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం కష్టమవుతోంది. సాధారణంగా వాంఖడేలో స్పిన్నర్ల ప్రభావం ఎక్కువ. అయితే ఈ ప్రపంచకప్‌లో పేసర్లు విజృంభిస్తున్నారు. దాంతో ఈ మ్యాచ్‌లో టాస్‌ అత్యంత కీలకపాత్ర పోషించనుంది.

Also Read: IND vs NZ Semi Final 2023: నేడే భారత్‌-న్యూజిలాండ్‌ తొలి సెమీస్‌.. ఇది ‘ప్రతీకార’ సమయం!

గతంలో భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో జయాపజయాలను పరిశీలిస్తే.. టీమిండియా స్వల్ప ఆధిక్యత కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 117 వన్డే మ్యాచ్‌ల్లో తలపడితే.. ఇందులో భారత్‌ 59, న్యూజిలాండ్‌ 50 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఓ మ్యాచ్‌ టై కాగా.. ఏడు మ్యాచ్‌లలో ఫలితం రాయలేదు. ఇక ప్రపంచకప్‌లో ఇరు జట్లు 9 సార్లు తలపడితే.. భారత్‌ 5, న్యూజిలాండ్‌ 4 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్లో తలపడడం ఇది వరుసగా రెండోసారి. 2019లో ఇరు జట్లు తొలిసారి సెమీ ఫైనల్లో ఎదురుపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్‌ను 21 పరుగుల తేడాతో కివీస్ ఓడించింది.