NTV Telugu Site icon

IND vs NZ Semi Final 2023: భారత్‌తో అంత ఈజీ కాదు: ట్రెంట్‌ బౌల్ట్‌

Trent Boult

Trent Boult

Trent Boult React on IND vs NZ World Cup 2023 Semifinal Match: వన్డే ప్రపంచకప్‌ 2023 సెమీఫైనల్‌లో భారత్‌తో అంత ఈజీ కాదని న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అన్నాడు. అభిమానుల మద్దతుతో సొంతగడ్డపై సెమీస్ మ్యాచ్‌ ఆడబోతున్న టీమిండియాను ఎదుర్కోవడం పెద్ద సవాల్‌ అని, తిరుగులేని ఫామ్‌లో ఉన్న జట్టును ఆపడం అంత తేలికేం కాదన్నాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన న్యూజిలాండ్‌.. దాదాపుగా సెమీస్‌ బెర్త్ ఖాయం చేసుకుంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు అధికారిక సెమీస్ బెర్తులు ఖరారు చేసుకోగా.. నాలుగో జట్టుగా కివీస్‌ ఆడనుంది. భారత్‌తో సెమీస్‌లో న్యూజిలాండ్‌ తలపడటం ఖాయమే అయింది.

బెంగళూరులో జరిగిన మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ట్రెంట్‌ బౌల్ట్‌ మాట్లాడుతూ… ‘ప్రపంచకప్‌ 2023లో భారత్‌ సానుకూలంగా ఆడుతోంది. ప్రపంచకప్‌ సెమీస్‌లో ఎలా టీమిండియాను ఎదుర్కోవాలో స్పష్టమైన అవగాహనతో ఉన్నాం. కచ్చితంగా భారత్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఉత్కంఠ రేపబోతోంది. గతంలో చాలాసార్లు ఆడినా.. 1.5 బిలియన్ల అభిమానుల మద్దతుతో సొంతగడ్డపై నాకౌట్‌ మ్యాచ్‌ ఆడబోతున్న భారత్‌ను ఎదుర్కోవడం పెద్ద సవాల్‌. తిరుగులేని ఫామ్‌లో ఉన్న రోహిత్ సేనను ఆపడం అంత తేలికేం కాదు. టీమిండియా టాప్ ఆటగాళ్లకు భారత్ పరిస్థితులు బాగా తెలుసు’ అని అన్నాడు.

Also Read: Semifinal Match 2023: భారత్ vs న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్.. 2019 ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం!

2019 ప్రపంచకప్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు సెమీఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 8 వికెట్ల నష్టానికి 239 రన్స్ చేసింది. ఆపై భారత్ 221 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే ప్రపంచకప్ 2023 తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక 16న కోల్‌కతా వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఢీ కొట్టనున్నాయి.

Show comments