NTV Telugu Site icon

IND vs NZ: భారత్‌, న్యూజిలాండ్‌ ఢీ.. ఐదవ విజయం ఎవరిదో?

Ind Vs Nz Preview

Ind Vs Nz Preview

India vs New Zealand 21st Match Prediction: వన్డే ప్రపంచకప్‌ 2023లో నేడు మెగా సమరం జరగనుంది. మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత్‌, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలవడమే కాదు.. ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఇరు జట్లు సమవుజ్జీల్లా ఉన్నాయి. అయితే ఈ రెండు జట్లలో ఐదవ విజయం ఎవరిదో?.. తొలి ఓటమిని రుచి చూసేదెవరు? అని క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధర్మశాలలో మధ్యాహ్నం 2 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది.

ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లను ఓడించి సెమీఫైనల్‌ దిశగా దూసుకెళ్తున్న టీమిండియాకు అసలు సవాలు నేడు ఎదురు కాబోతోంది. ప్రపంచకప్‌ ముంగిట కివీస్‌పై పెద్దగా అంచనాలు లేవు కానీ.. టోర్నీ ఆరంభమయ్యాక ఆ జట్టు సత్తా ఏంటో తెలిసింది. ఇప్పుడు సెమీస్‌కు బలమైన ఫేవరెట్‌గా కివీస్ మారింది. పేసర్లకు అనుకూల పరిస్థితుల ఉండే ధర్మశాలలో మ్యాచ్‌ జరగబోతుండటం కివీస్‌కు కలిసొచ్చే విషయం. భారత్ సొంత గడ్డపై ఉన్న అనుకూలతలు మరోసారి ఉపయోగించుకోవాలని చూస్తోంది. అయితే గత టోర్నీలో కివీస్ షాక్ ఇచ్చిన నేపథ్యంలో రోహిత్ సేన అప్రమత్తంగా ఉండాల్సిందే.

మెగా టోర్నీలో రోహిత్‌, కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్నారు. గిల్, శ్రేయస్‌, రాహుల్‌ సత్తా చాటుతున్నారు. అయితే పేస్‌, స్పిన్‌ విభాగాల్లో పటిష్టంగా ఉన్న కివీస్‌ నుంచి భారత బ్యాటర్లకు సవాలు తప్పదు. ఒకవేళ టాప్‌ ఆర్డర్‌ విఫలమైతే.. మిడిలార్డర్‌ ఎలా ఆడుతుందో చూడాలి. హార్దిక్‌ పాండ్యా లేడు కాబట్టి ఆర్ జడేజా సత్తా చాటాలి. బౌలింగ్‌లో జోరుమీదున్న బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్, జడేజాలి కివీస్ బ్యాటరలను కట్టడి చేస్తేనే విజయావకాశాలు ఎక్కువ.

Also Read: Weather Update: తమిళనాడులో వర్షానికి నీట మునిగిన రోడ్లు.. 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్

మరోవైపు కివీస్ అన్ని విభాగాల్లో పటిష్టంగానే ఉంది. కాన్వే, యంగ్‌ శుభారంభాలు అందిస్తుండగా.. రచిన్, లాథమ్‌ దానిని కొనసాగిస్తున్నారు. ఫిలిప్స్, చాప్‌మన్‌ మెరుపులు మెరిపిస్తున్నారు. బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీలతో పేస్‌ బౌలింగ్‌ బలంగా ఉంది. వీరిని ఎదుర్కోవడం అంత సులువు కాదు. స్పిన్నర్ సాన్‌ట్నర్‌ సత్తా చాటగలడు. ఇక చల్లటి వాతావరణం ఉండే ధర్మ శాలలో పరిస్థితులు పేసర్లకు బాగా అనుకూలిస్తాయి. శనివారం పిచ్‌పై బాగా పచ్చిక ఉనా.. మ్యాచ్‌ సమయానికి అది తగ్గిపోవచ్చు. నేటి మ్యాచ్ ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపే అవకాశముంది. స్పిన్నర్లకు చెలరేగే అవకాశముంటుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పేమీ లేదు.

తుది జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, సూర్యకుమార్‌, జడేజా, కుల్‌దీప్‌, షమి/శార్దూల్‌, బుమ్రా, సిరాజ్‌.
న్యూజిలాండ్‌: కాన్వే, యంగ్‌, రచిన్‌, మిచెల్‌, లేథమ్‌ (కెప్టెన్‌), ఫిలిప్స్‌, చాప్‌మన్‌, శాంట్నర్‌, ఫెర్గూసన్‌, హెన్రీ, బౌల్ట్‌.