Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!

  • క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 4 వికెట్ల తేడాతో విజయం.
  • తొలి టీ20లో భారత్‌కు థ్రిల్లింగ్ విక్టరీ.
  • తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 225/4.
  • భారత్ 19.4 ఓవర్లలో 230/6..
Ind Vs Nz

Ind Vs Nz

Ind vs NZ: న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు శుభారంభం చేసింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌పై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ దూకుడుగా ఆడారు. సీఫర్ట్ 17 బంతుల్లో 24 పరుగులు చేయగా, ఫిన్ అలెన్ కేవలం 24 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. డారిల్ మిచెల్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ స్కోరును భారీగా పెంచాడు. ఫిలిప్స్ కేవలం 40 బంతుల్లోనే 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. బెవోన్ జాకబ్స్ 16 బంతుల్లో 31 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. అయితే భారత బౌలర్లు పరుగులు భారీగా సమర్పించుకోవడంతో న్యూజిలాండ్‌కు భారీ స్కోరు లభించింది. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 51 పరుగులు ఇవ్వగా, భువనేశ్వర్ కుమార్ 49 పరుగులు ఇచ్చాడు.

226 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ మంచి శుభారంభం అందించారు. అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. మరోవైపు సంజు శాంసన్ మాత్రం మొదటి నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి వేగంగా పరుగులు చేయడంతో భారత్ పవర్‌ప్లేలోనే భారీ స్కోరు దిశగా సాగింది. అభిషేక్ శర్మ ఔటైన తర్వాత భారత్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. సంజు శాంసన్ 67 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. అనంతరం తిలక్ వర్మ కేవలం 6 పరుగులకే ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ కూడా 1 పరుగుకే వెనుదిరిగాడు. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక స్టేజిలో భారత్ 122 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అక్షర్ పటేల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. శ్రేయాస్ అయ్యర్ 28 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ కూడా వేగంగా ఆడి 14 బంతుల్లో 24 పరుగులు చేశాడు. వీరిద్దరూ జట్టును లక్ష్యానికి చేరువ చేశారు. అయితే అక్షర్ పటేల్ 24 పరుగుల వద్ద, శ్రేయాస్ అయ్యర్ 42 పరుగుల వద్ద ఔటవడంతో మ్యాచ్ మళ్లీ ఉత్కంఠగా మారింది. ఈ సమయంలో నామన్ ధీర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. కేవలం 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసి న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీనితో నామన్ ధీర్ చివరి వరకు నాటౌట్‌గా నిలిచి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి 2 పరుగులతో అతడికి తోడుగా నాటౌట్‌గా నిలిచాడు. భారత్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 230 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.