NTV Telugu Site icon

Team India: ఒక్కరోజే 400 పరుగులు చేయగల టీమ్ కావాలి: గంభీర్

India Test History

India Test History

Gautam Gambhir About Team India Batting: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. బంగ్లాతో కాన్పూర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. రోహిత్ సేన దూకుడు కారణంగా అద్భుత విజయం సాధించింది. కివీస్‌తో సిరీస్‌లో కూడా అలానే ఆడతారా? అని అందరిలో ఆసక్తి నెలకొంది. న్యూజిలాండ్‌ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్‌ తీరుపై కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.

టెస్టుల్లో టీమిండియాకు నిర్దిష్టంగా ఒక బ్యాటింగ్ స్టైల్ లేదని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ‘మేం టెస్టుల్లో ఒక్కరోజే 400 పరుగులు చేయాలనుకుంటున్నాం. అవసరమైతే ఓటమి నుంచి తప్పించుకోవడానికి రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేయగల జట్టుగా ఉండాలని కోరుకుంటున్నాము. జట్టును ఆ విధంగా తయారు చేయడంపై మేం దృష్టి సారించాం. జట్టు అలా ఉంటేనే అసలైన టెస్ట్ క్రికెట్ మజా వస్తుంది. కొన్ని అద్భుతాలు కూడా జరుగుతాయి. భారత జట్టులో ఈ రెండింటినీ చేయగల బ్యాటర్లు ఉన్నారు. కొందరు దూకుడుగా ఆడటమే కాదు.. డిఫెన్స్‌ కూడా చేయగలరు’ అని గంభీర్ చెప్పాడు.

Also Read: Wifi Password: పాస్‌వర్డ్‌తో పనిలేదు.. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే చాలు!

‘ఒక్కరోజే 400 పరుగులు చేయడమంటే.. గెలవడం కోసమే. ఒకవేళ డ్రా కోసం ఆడాల్సిన పరిస్థితి వస్తే డిఫెన్స్‌ రెండో ఆప్షన్. సహజమైన ఆటను ఆడాలనుకునే క్రికెటర్లను మేం ప్రోత్సహిస్తాం. ఒక్కరోజులో 400-500 పరుగులు చేయగల ఆటగాళ్లను మనం ఎందుకు పక్కన పెట్టాలి. ఈ హై రిస్క్ తీసుకోవడానికి కారణం టీ20 క్రికెట్ అనే చెప్పాలి. టెస్టుల్లో అప్పుడప్పుడు 100కే ఆలౌటయ్యే పరిస్థితి రావొచ్చు. అప్పుడు డ్రా కోసం ఆడతాం’ అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.