NTV Telugu Site icon

IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. టీమిండియా కఠిన నిర్ణయం!

Wankhede Stadium Pitch

Wankhede Stadium Pitch

సొంతగడ్డపై ఎదురులేని భారత్.. న్యూజిలాండ్‌తో మూడు టెస్టు సిరీస్‌ను సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. టీమిండియాకు ప్రధాన అస్రం అయిన స్పిన్ ఉచ్చులోనే పడి భారత బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. కివీస్‌ రెండు టెస్టుల్లోనూ విజయం సాధించి.. భారత గడ్డపై మొదటిసారి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. నవంబర్ 1 నుంచి ముంబై వేదికగా జరిగే మూడో టెస్టులో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలోనే పిచ్‌ విషయంలో టీమిండియా కఠిన నిర్ణయం తీసుకుందని సమాచారం.

Also Read: Diwali Offers 2024: ‘పండగ’ ఆఫర్లు.. 12 వేలకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

బెంగళూరు, పూణే టెస్టుల్లో మొదటి రోజు నుంచే పిచ్‌ స్పిన్నర్లకు సహకరించింది. దీనిని దృష్టిలో ఉంచుకొని.. ముంబైలోని వాంఖడే పిచ్‌ను భిన్నంగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. మొదటి రోజు నుంచే బ్యాటర్లకు అనుకూలించేలా పిచ్‌ తయారుచేస్తున్నారని సమాచారం. ముంబై పిచ్ మొదటి రోజు బ్యాటింగ్ అనుకూలిస్తుందని, రెండో రోజు నుంచి స్పిన్నర్లకు సహకరిస్తుందని బీసీసీఐ సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పిచ్‌పై కాస్త పచ్చిక ఉన్నా.. స్పోర్టింగ్ ట్రాక్ అని చెప్పాయి. సోమవారం బీసీసీఐ చీఫ్ పిచ్ క్యూరేటర్ ఆశిశ్ బౌమిక్‌, ఎలైట్ ప్యానెల్ క్యూరేటర్ తపోష్ ఛటర్జీ పిచ్‌ను సమీక్షించేందుకు వాంఖడే క్యూరేటర్ రమేశ్‌ మముంకర్‌ను కలిశారు.