NTV Telugu Site icon

IND vs NZ: టీమిండియాకు శుభవార్త.. నేడు బ్యాటింగ్‌కు పంత్!

Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant Batting Today in Bengaluru: బెంగళూరు టెస్టులో నేడు నాలుగో రోజు. మూడో రోజైన శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ 231/3 స్కోర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైన రోహిత్‌ శర్మ (52; 63 బంతుల్లో 8×4, 1×6), విరాట్‌ కోహ్లీ (70; 102 బంతుల్లో 8×4, 1×6), సర్ఫరాజ్‌ ఖాన్‌ (70 బ్యాటింగ్‌; 78 బంతుల్లో 7×4, 3×6)లు జట్టును ఆదుకున్నారు. మూడో రోజు ఆటలో చివరి బంతికి కోహ్లీ అవుటయ్యాడు. దాంతో గాయపడిన రిషబ్ పంత్ నాలుగో రోజు బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వస్తాడా? లేదా? అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

2022 డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్‌ మోకాలికి తీవ్ర గాయం అవ్వడంతో శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు బెంగళూరు టెస్టులో ఆ మోకాలికే గాయమైంది. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 37వ ఓవర్‌ చివరి బంతి తక్కువ ఎత్తులో వచ్చి అతడి కుడి మోకాలికి తగిలింది. ఫిజియో వచ్చి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మూడోరోజైన శుక్రవారం పంత్ వికెట్ కీపింగ్‌కు రాలేదు. అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా ధ్రువ్ జురెల్ కీపింగ్‌ను కొనసాగించాడు. విరాట్ కోహ్లీ ఔటైన నేపథ్యంలో శుక్రవారం ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సింది పంతే. గురువారం పంత్‌ బ్యాటింగ్‌ సాధన చేశాడు. మ్యాచ్‌లో విరామ సమయంలో మైదానంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దాంతో నేడు పంత్ బ్యాటింగ్ చేయడం ఖాయం అయింది. అంతేకాదు రిషబ్ నాలుగో రోజు బ్యాటింగ్‌ చేస్తాడని జట్టు వర్గాలు కూడా తెలిపాయి.

Also Read: IND vs NZ: ఓటమి ఉచ్చులోనే భారత్.. ఈరోజు నిలబడితేనే..! ఆశలన్నీ ఆ ఇద్దరిపైనే

రిషబ్ పంత్‌ బ్యాటింగ్ చేయడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. దూకుడుగా ఆడే అతడు కనీసం హాఫ్ సెంచరీ చేసినా.. జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సర్ఫరాజ్‌ ఖాన్ మంచి ఊపులో ఉన్నాడు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్‌ కూడా బ్యాట్ జుళిపిస్తే.. భారత్‌ 125 పరుగుల లోటును పూడ్చుకోవడంతో పాటు 150-200 మధ్య ఆధిక్యం సంపాదించగలదు. నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యం 150 దాటినా ఛేదన అంత తేలిక కాకపోవచ్చు.

Show comments