IND vs IRE 2nd T20 Preview and Playing 11: ఐర్లాండ్ పర్యటనలో యువ భారత్ శుభారంభం చేసింది. తొలి టీ20లో గెలిచిన భారత్.. రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు టీ20ల్లో ప్రమాదకర జట్టు అయిన ఐర్లాండ్ సిరీస్ సమం చేయాలని చూస్తోంది. ది విలేజ్ మైదానంలో ఆదివారం రాత్రి 7.3ఓ గంటలకు భారత్, ఐర్లాండ్ మధ్య రెండో టీ20 జరగనుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. సీనియర్ల గైర్హాజరీలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు.
ఐర్లాండ్‌తో తొలి టీ20లో బరిలోకి దిగింది ద్వితీయ శ్రేణి జట్టే అయినా భారత్ ప్రదర్శన బాగానే ఉంది. ముఖ్యంగా బౌలర్ల ప్రదర్శన హైలైట్ అని చెప్పాలి. తన 4 ఓవర్ల కోటాలో 24 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టాడు. బుమ్రా పూర్తి ఫిట్‌నెస్, లయ అందుకున్నట్లే కనిపిస్తోంది. అయితే ఒకప్పటితో పోలిస్తే బుమ్రా బౌలింగ్ శైలిలో కొంత మార్పు కనిపించడం గమనార్హం. మొత్తానికి ఈ మ్యాచ్‌లోనూ బుమ్రా పైనే అందరి కళ్లు నిలిచి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆకట్టుకున్నాడు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ సత్తాచాటాడు. అయితే 59 పరుగులకే 6 వికెట్లు పడగొట్టిన బౌలర్లు.. ప్రత్యర్థిని 139 పరుగులు చేయనివ్వడం కాస్త నిరాశ కలిగించే అంశం. మధ్య ఓవర్లలో భారత బౌలర్లు చెలరేగాల్సిన అవసరం ఉంది. తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా భారత ఇన్నింగ్స్ సాగింది 6.5 ఓవర్లే కాబట్టి.. బ్యాటర్స్ ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం రాలేదు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ చక్కగా ఆరంభించారు. అయితే తిలక్ వర్మ డకౌట్ కావడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది.
Also Read: UAE vs NZ T20: టీ20 క్రికెట్‌లో యూఏఈ సంచలనం.. పెద్ద జట్టుకు భారీ షాక్!
మరోవైపు ఐర్లాండ్ టీ20ల్లో ప్రమాదకర జట్టు. మంచి హిట్టర్లు జట్టులో ఉన్నారు. స్టిర్లింగ్, బాల్‌బిర్నీ, టెక్టార్ లాంటి సీనియర్ బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్‌లో లిటిల్, యంగ్, క్యాంఫర్ కీలకం. తొలి మ్యాచ్‌లో ప్రధాన బ్యాటర్ల వైఫల్యంతో ఐర్లాండ్ ఇబ్బంది పడింది. లేదంటే మంచి లక్ష్యంను భారత్ ముందుంచేది. రెండో టీ20లో స్టిర్లింగ్, బాల్‌బిర్నీ, టెక్టార్ చెలరేగితే టీమిండియాకు ఇబ్బందులు తప్ప్పవు. యంగ్ వైవిధ్యమైన బంతులతో భారత్‌ను ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది.
జట్లు (అంచనా):
భారత్: యశస్వి, రుతురాజ్, తిలక్ వర్మ, శాంసన్, రింకూ సింగ్, దూబే, సుందర్, బుమ్రా (కెప్టెన్), అర్ష్‌దీప్, బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ.
ఐర్లాండ్: స్టిర్లింగ్ (కెప్టెన్), బల్బిర్నీ, టక్కర్, టెక్టర్, క్యాంపర్, డాక్‌రెల్, మార్క్ అడైర్, మెకార్తీ, యంగ్, జోష్ లిటిల్, బెన్‌వైట్.