NTV Telugu Site icon

Suryakumar Yadav: మా ఓటమికి కారణం అతడే: సూర్య

Suryakumar Yadav Speech

Suryakumar Yadav Speech

మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్ ఓడిపోయింది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లను 145 పరుగులే చేసింది. హార్దిక్‌ పాండ్యా (40; 35 బంతుల్లో 1×4, 2×6) టాప్‌ స్కోరర్‌. జేమీ ఒవర్టన్‌ (3/24), బ్రైడన్‌ కార్స్‌ (2/28) దెబ్బకొట్టారు. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (51; 28 బంతుల్లో 7×4, 2×6) హాఫ్ సెంచరీ బాదాడు. వరుణ్‌ చక్రవర్తి (5/24) అద్భుత ప్రదర్శన చేశాడు.

భారత్ ఓటమికి అదిల్ రషీద్ స్పెల్‌ కారణమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. ‘మ్యాచ్‌కు మంచు ప్రభావం ఉంటుందని భావించా. హార్దిక్‌ పాండ్యా, అక్షర్ పటేల్ క్రీజ్‌లో ఉన్నప్పుడు మ్యాచ్‌ గెలుస్తాం అనుకున్నాం. తిలక్ వర్మ దూకుడుగానే ఆడాడు. ఈ విజయం అదిల్ రషీద్‌కే దక్కుతుంది. అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కనీసం స్ట్రైక్‌ రొటేట్ కూడా చేయనీయలేదు. అందుకే రషీద్‌ ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్‌ అయ్యాడు’ అని చెప్పాడు. మూడో టీ20లో ఆదిల్ రషీద్‌ ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చి.. ఓ వికెట్ పడగొట్టాడు. కీలక బ్యాటర్ తిలక్ వర్మ (18)ను క్లీన్‌ బౌల్డ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

Also Read: Jasprit Bumrah: మరీ పొంగిపోను.. నా కాళ్లు నేలపైనే ఉంటాయి!

‘భారత జట్టులో ఎక్కువ మంది స్పిన్నర్లకు అవకాశం ఇవ్వడానికి కారణం పిచ్‌. రాజ్‌కోట్‌ పిచ్ నుంచి మంచి సహకారం లభిస్తుందనే ఉద్దేశంతోనే స్పిన్నర్లను తీసుకుందాం. బౌలింగ్‌ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్ సూపర్. బ్యాటింగ్‌లో మేం ఇంకా మెరుగుకావాల్సి ఉంది. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాం. తదుపరి మ్యాచుకు సిద్దమవుతాం’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. శుక్రవారం నాలుగో టీ20 పుణెలో జరుగుతుంది.