NTV Telugu Site icon

Rohit Sharma: కెరీర్‌లో ఏనాడూ ఎన్‌సీఏకు వెళ్లలేదు.. విరాట్ కోహ్లీని చూసి యువ క్రికెటర్లు నేర్చుకోవాలి: రోహిత్

Virat Kohli Hugs Rohit Sharma

Virat Kohli Hugs Rohit Sharma

Rohit Sharma Hails Virat Kohli Fitness: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ పట్ల కోహ్లీకి ఉన్న అభిరుచి, అంకితభావం అద్భుతమని కొనియాడాడు. విరాట్ ఎప్పుడూ పరుగుల దాహంతో ఉంటాడని రోహిత్ పేర్కొన్నాడు. కెరీర్‌లో ఏనాడూ విరాట్ పునరావాసం కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కు వెళ్లలేదని, అతడి ఫిట్‌నెస్‌కు ఇది ఓ నిదర్శనం అని తెలిపాడు. కోహ్లీని చూసి యువ క్రికెటర్లు ఎంతో నేర్చుకోవాలని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇటీవల జియో సినిమాలో దినేష్ కార్తీక్‌తో జరిగిన ఇంటర్వ్యూలో రోహిత్ ఇలా అన్నాడు.

‘విరాట్‌ కోహ్లీని దగ్గరి నుంచి చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కోహ్లీకి ఆటపై మక్కువ ఎక్కువ. ఆటపై అతడి అభిరుచి, అంకితభావం అద్భుతం. ఎల్లప్పుడూ పరుగులు చేయాలనే ఆకలితో ఉంటాడు. ఏ సమయంలో అయినా జట్టు కోసం గొప్పగా పోరాడుతుంటాడు. కోహ్లీ మైదానం వెలుపల ఏమి చేస్తాడో ఎవరికీ తెలియదు. విరాట్ అంకితభావంతో ఉంటాడు. కోహ్లీని చూసి యువ క్రికెటర్లు ఎంతో నేర్చుకోవాలి’ అని రోహిత్ శర్మ అన్నాడు.

Also Read: Hardik Pandya: నాకు ఆ మైదానం గుడితో స‌మానం: హార్దిక్ పాండ్యా

‘విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ సంబంధిత సమస్యల కోసం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)కి ఎప్పుడూ వెళ్లలేదు. క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా అక్కడికి వెళ్లలేదు. అతడి ఫిట్‌నెస్‌కు ఇది నిదర్శనం. యువకులు తమ ఆటను ఎలా మెరుగుపరుచుకోవాలనేది కోహ్లీ నుంచి నేర్చుకోవాలి. విరాట్ ఎప్పుడూ జట్టుకు దూరంగా ఉండడు. తాను కావాలనుకుంటే 2-3 సిరీస్‌ల నుంచి విశ్రాంతి కోరుకోవచ్చు. కానీ అతడు అలా చేయడు. ప్రతి సమయంలోనూ క్రికెట్ కోసం అందుబాటులో ఉంటాడు. యువ క్రికెటర్ల నుంచి ఇదే ఆశిస్తున్నా’ అని రోహిత్ శర్మ చెప్పాడు.

విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. ఉప్పల్ టెస్టులో బరిలోకి దిగడానికి విరాట్ హైదరాబాద్‌ చేరుకున్నా.. వ్యక్తిగత కారణాలతో అదే రోజు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. బీసీసీఐ అనుమతి తీసుకుని విరాట్ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో రజత్ పటిదార్ జట్టులోకి వచ్చాడు. మూడో టెస్ట్ నుంచి కింగ్ కోహ్లీ అందుబాటులో ఉంటాడు. విరాట్ సతీమణి అనుష్క షేర్మ గర్భవతి అన్న విషయం తెలిసిందే. ఆమె కోసమే విరాట్ తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.