Most Wickets In International Cricket for India: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జడేజా ఈ ఘనత అందుకున్నాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టోను ఔట్ చేయడం ద్వారా జడ్డూ ఈ ఘనతను అందుకున్నాడు. జడేజా ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 552 వికెట్లు పడగొట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో రవీంద్ర జడేజాకు ఇది 552వ వికెట్. ఇప్పటివరకు టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో 332 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 552 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ రికార్డును అతడు అధిగమించాడు. శ్రీనాథ్ అంతర్జాతీయ కెరీర్‌లో 551 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో స్పిన్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తొలి స్థానంలో ఉన్నాడు. జంబో 953 వికెట్స్ పడగొట్టాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 723 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (597) ఈ జాబితాలో ఉన్నారు.
Also Read: Filmfare Awards 2024: జవాన్, 12th ఫెయిల్ సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్!
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. నాలుగో రోజు ప్రారంభంలోనే పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొత్త బంతితో వికెట్ తీశాడు. రెహాన్ (28) వికెట్ కీపర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే స్టార్ బ్యాటర్ ఓలీ పోప్ అద్భుత పోరాటంతో తమ జట్టును ముందుకు తీసుకెళుతున్నాడు. ఇంగ్లండ్ స్కోరు 346/7 (84). పోప్ (162), హార్ట్‌లీ (2) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ 156 పరుగుల ఆధిక్యంలో ఉంది.