Site icon NTV Telugu

Jasprit Bumrah: కోహ్లీ, రోహిత్‌, అశ్విన్‌.. నెక్స్ట్‌ రిటైర్మెంట్ జస్ప్రీత్ బుమ్రానే?

Jasprit Bumrah

Jasprit Bumrah

Mohammad Kaif on Jasprit Bumrah Retirement: టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మాంచెస్టర్ టెస్ట్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. మూడో రోజు 28 ఓవర్లలో ఒకే వికెట్‌ పడగొట్టాడు. అంతకుముందు రెండు టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో మినహా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఐదు టెస్ట్ సిరీస్‌లో కేవలం మూడే ఆడుతానని చెప్పిన బుమ్రా.. కొన్ని సందర్భాల్లో అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు. ఇది అతడి ఫిట్‌నెస్‌పై ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ స్పందించాడు.

31 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా తన దేహంతో పోరాటంలో ఓడిపోయినట్లు కనిపిస్తున్నాడని మహ్మద్‌ కైఫ్‌ అన్నాడు. రవిచంద్రన్ అశ్విన్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ తర్వాత రిటైరయ్యే పెద్ద ఆటగాడు బుమ్రానే అని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు. ‘జస్ప్రీత్ బుమ్రా వచ్చే టెస్ట్ మ్యాచ్‌లలో ఆడకపోవచ్చు. రెడ్ బాల్ ఫార్మాట్ నుంచి రిటైర్ కూడా కావచ్చు. బుమ్రా తన శరీరంతో ఇబ్బంది పడుతున్నాడు. నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో తన వేగాన్ని చూపించలేదు. బుమ్రా స్వతంత్ర వ్యక్తి. తన వంద శాతం ప్రదర్శన ఇవ్వలేకపోతున్నానని, వికెట్లు తీయడం లేదని భావిస్తే స్వయంగా రిటైర్‌ అవుతాడు. ఇది నా అభిప్రాయం మాత్రమే’ అని కైఫ్‌ చెప్పాడు.

Also Read: VD : తిరుమల శ్రీవారి సేవలో విజయ్ దేవరకొండ

ఆర్ అశ్విన్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు ఇప్పటికే రిటైర్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా వంతు అని నాకు అనిపిస్తోంది. బుమ్రా లేని టెస్టు క్రికెట్‌కు అలవాటు పడడం ఫాన్స్ ఇప్పటినుంచే మొదలు పెట్టాలి. నా అంచనా తప్పు కావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. అయితే ఓ విషయం చెప్పాలి. మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రాను చూస్తుంటే.. ఆటను ఆస్వాదించట్లేదని అనిపిస్తోంది. అతడు తన దేహంతో పోరాటంలో ఓడిపోయాడు. ఆట పట్ల ఇష్టం ఇంకా ఉన్నా కానీ.. అతడి దేహం సహకరించట్లేదు. ఈ స్థితిలో ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి’ అని మహ్మద్‌ కైఫ్‌ తన ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.

Exit mobile version