NTV Telugu Site icon

IND vs ENG: ఉప్పల్‌ టెస్టు.. లక్ష్య ఛేదనలో భారత్ తడబాటు!

Tom Hartley

Tom Hartley

India in trouble as Rohit Sharma departs: హైదరాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తడబడుతోంది. 231 ప‌రుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. 63 పరుగులకే కీలమైన టాపార్డర్‌ బ్యాటర్లను కోల్పోయింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీ మూడు వికెట్స్ పడగొట్టాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 39పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. హార్ట్‌లీ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్‌ ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. అంతకుముందు యశస్వి జైస్వాల్‌ (15), శుభ్‌మన్‌ గిల్‌ను (0) ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపాడు. 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది.

కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌ ఇంగ్లీష్ స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించేందుకు చుస్తున్నారు. ఈ క్రమంలో దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్నారు. రెహాన్ అహ్మద్ వేసిన ఒకే ఓవర్లో అక్షర్‌ మూడు బౌండరీలు బాదాడు. అంతకుముందు టామ్‌ హార్ట్‌లీ బౌలింగ్‌లో రాహుల్ రెండు బౌండరీలు బాదాడు. భారత్ 27 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ (20) అక్షర్‌ పటేల్‌ (17) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 137 రన్స్ కావాలి.

Also Read: AUS vs WI: నిప్పులు చెరిగిన విండీస్ పేసర్ షమర్ జోసెఫ్.. గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి!

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. బెన్‌ స్టోక్స్‌ (70) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో ఆర్ అశ్విన్‌, ఆర్ జడేజా తలో 3 వికెట్లు పడగొట్టారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (87), కేఎల్ రాహుల్‌ (86), యశస్వి జైస్వాల్‌ (80) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో రూట్‌ 4 వికెట్స్ పడగొట్టాడు. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్‌ ఒలీ పోప్‌ త్రుటిలో డబుల్‌ సెంచరీ (196) చేసే అవకాశాన్ని కోల్పోయాడు.