NTV Telugu Site icon

IND vs ENG 4th Test: విజయానికి 152 పరుగులే.. భారత్‌కు అంత ఈజీ కాదు!

Team India Test

Team India Test

Ranchi Test Pitch Report Today: రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 152 పరుగులు మాత్రమే అవసరం. అయితే అది భారత్‌కు అంత ఈజీ కాకపోవచ్చు.

రాంచీ పిచ్ నాలుగో రోజు మరింతగా స్పిన్‌కు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. స్పిన్నర్లకు తగినట్లుగా ఈ పిచ్ మారుతుంది. కాబట్టి ఇంగ్లండ్‌ స్పిన్నర్లు టామ్ హార్ట్‌లీ, షోయబ్‌ బషీర్‌, జో రూట్ చెలరేగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తేనే విజయం సాధ్యమవుతుంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో బషీర్‌ 5, హార్ట్‌లీ 3 వికెట్స్ పడగొట్టారు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆర్ అశ్విన్ 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్స్ పడగొట్టిన విషయం తెలిసిందే.

Also Read: R Ashwin: అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసిన ఆర్ అశ్విన్‌!

మూడో రోజు భారత్‌ను 307 పరుగులకు ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. భారత స్పిన్నర్ల ధాటికి 145 పరుగులకే ఆలౌట్ అయింది. అశ్విన్, కుల్దీప్ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లీష్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. బెన్ డకెట్ (15), ఓలీ పోప్ (0), జో రూట్ (11), బెన్ స్టోక్స్ (4) మళ్లీ నిరాశపరిచారు. జాక్ క్రాలే (60), జానీ బెయిర్‌స్టో (30)లు టాప్ స్కోరర్లు. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ మూడో రోజు ఆట ముగిసేసరికి 40/0తో ఉంది.

Show comments