టీమిండియా హెడ్ కోచ్ పదవిపై బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక ప్రకటన చేశాడు. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ 2024 వరకు భారత జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడే కొనసాగుతాడని స్పష్టం చేశాడు. ద్రవిడ్‌తో రెండేళ్ల ఒప్పందం 2023 వన్డే ప్రపంచకప్‌తో ముగిసింది. అయితే ప్రపంచకప్ అనంతరం జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనలోనూ హెడ్ కోచ్‌గా కొనసాగాల్సిందిగా బీసీసీఐ కోరింది. అయితే రాహుల్ పదవీ కాలం ఎప్పటివరకు అన్నది మాత్రం బీసీసీఐ చెప్పలేదు. తాజాగా ద్రవిడ్‌తో మాట్లాడి.. టీ20 ప్రపంచకప్ 2024 వరకు ఒప్పందాన్ని పొడిగించినట్లు జై షా వెల్లడించాడు.
Also Read: Sarfaraz Khan: నా తప్పే.. సారీ సర్ఫరాజ్: జడేజా
రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య గురువారం మొదలైన మూడో టెస్ట్‌కు ముందు జై షా మాట్లాడుతూ… ‘2023 వన్డే ప్రపంచకప్ ముగిశాక రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడే అవకాశం దొరకలేదు. మెగా టోర్నీ అనంతరం ద్రవిడ్ భాయ్ వెంటనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత స్వదేశంలో అఫ్గాన్‌తో సిరీస్‌తో బిజీ అయ్యాడు. రాజ్‌కోట్ టెస్ట్‌కు ముందు ద్రవిడ్‌తో నేరుగా మాట్లడే అవకాశం దొరికింది. టీ20 ప్రపంచకప్ 2024 వరకు కోచ్‌గా కొనసాగాలని కోరాం. అందుకు ద్రవిడ్ సానుకూలంగా స్పందించాడు. టీమిండియాను ద్రవిడ్ సమర్దవంతంగా నడిపించగలడు. అతని మార్గనిర్దేశకంలో టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా రాణిస్తుందన్న నమ్మకం ఉంది. సహాయక కోచింగ్ సిబ్బంది కూడా టీ20 ప్రపంచకప్ వరకు యధాతథంగా కొనసాగుతారు’ అని జై షా స్పష్టం చేశాడు.