NTV Telugu Site icon

IND vs ENG: నేడు ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. భారత్ బోణీ కొట్టేనా?

Ind Vs Eng

Ind Vs Eng

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌ మరో టెస్టుకు సిద్ధమైంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ శుక్రవారం ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఓటమితో ఒత్తిడిని ఎదుర్కొంటున్న భారత్.. అచ్చొచ్చిన మైదానంలో విజయం సాధించాలని చూస్తోంది. బజ్‌బాల్‌ ఆటతో సిరీస్‌లో శుభారంభం చేసిన ఇంగ్లండ్‌.. ఆధిక్యం పెంచుకోవాలని చూస్తోంది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో మరోసారి రసవత్తర పోరు సాగే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానుండగా.. 9 గంటలకు టాస్ పడుతుంది.

రెండో టెస్టులో గెలవాలంటే భారత బ్యాటింగ్‌ మెరుగుపడాల్సి ఉంది. గత మ్యాచ్‌లో రాణించిన రవీంద్ర జడేజా, లోకేష్ రాహుల్‌ లేకపోవడం దెబ్బే. తుది జట్టులోకి వచ్చేందుకు రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ మధ్య గట్టిపోటీ ఉంది. ఈ ఇద్దరు నెట్స్‌లో చెమటోడ్చారు. వీళ్లలో ఒకరు టెస్టు అరంగేట్రం చేయడం ఖాయం. విరాట్ స్థానంలో తొలి టెస్టుకు ముందే జట్టులోకి వచ్చిన రజత్‌కే అవకాశం దక్కేలా ఉంది. జడేజా స్థానంలో కుల్దీప్, సుందర్‌ రేసులో ఉన్నారు. స్పెషలిస్టు స్పిన్నర్‌ కావాలనుకుంటే కుల్దీప్‌నే ఆడించొచ్చు. ఆలా కాకుండా బ్యాటింగ్‌ పటిష్టం కావాలంటే సుందర్‌ను తీసుకోవచ్చు. ఈ టెస్టులో భారత్‌ ఒకే పేసర్‌ను ఆడించాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలిసింది. శుభ్‌మన్‌, శ్రేయస్‌ఎం భరత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. ఫేవరేట్ మైదానంలో కెప్టెన్‌ రోహిత్‌ చెలరేగాలి అభిమానులు కోరుకుంటున్నారు.

ఇంగ్లండ్‌ తరఫున షోయబ్‌ బషీర్‌ అరంగేట్రం చేయనున్నాడు. హార్ట్‌లీ, రెహాన్‌లకు అతడు తోడు కానున్నాడు. స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ మోకాలి గాయంతో జట్టుకు దూరమయిన విషయం తెలిసిందే. భారత్‌ బ్యాటర్లు వీరితో జాగ్రత్తగా ఉండాల్సిందే. మరోవైపు ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగానే ఉంది. ఇదే వేదికపై భారత్‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్‌ గెలిచి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Jharkhand CM: నేడు ఝార్ఖండ్‌ సీఎంగా చంపయీ సోరెన్‌ ప్రమాణస్వీకారం.. 10 రోజుల్లో బలపరీక్ష!

తుది జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), యశస్వి, శుభ్‌మన్‌, శ్రేయస్‌, రజత్‌/సర్ఫరాజ్‌, కేఎస్‌ భరత్‌, అక్షర్‌, అశ్విన్‌, కుల్‌దీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌/సిరాజ్‌, బుమ్రా.
ఇంగ్లండ్: క్రాలీ, డకెట్‌, పోప్‌, రూట్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌ (కెప్టెన్‌), ఫోక్స్‌ (వికెట్‌ కీపర్‌), రెహాన్‌ అహ్మద్‌, హార్ట్‌లీ, షోయబ్‌ బషీర్‌, అండర్సన్‌.