NTV Telugu Site icon

IND vs BAN: రెండో టెస్టు నుంచి సర్ఫరాజ్‌ రిలీజ్‌.. కారణం ఏంటంటే?

Sarfaraz Khan India

Sarfaraz Khan India

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ సెప్టెంబర్ 27 నుండి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో ఆరంభం కానుంది. మొదటి టెస్టులో ఆడని యువ బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్‌కు.. రెండో టెస్టులో కూడా చోటు దక్కే అవకాశాలు లేవు. తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాతో రెండో టెస్టు జట్టు నుంచి సర్ఫరాజ్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇరానీ ట్రోఫీలో అతడిని ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 1 నుండి 5 వరకు లక్నోలో ఇరానీ కప్ జరగనుంది. ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇరానీ కప్ కోసం సర్ఫరాజ్‌ ఖాన్‌ను ముంబై జట్టులో చేర్చాలని బీసీసీఐ చూస్తోంది. భారత జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లకు గాయాలు లేదా ఫిట్‌నెస్ సమస్యలు లేకుంటే.. సర్ఫరాజ్‌ను టీమ్ నుంచి రిలీజ్ చేయాలని భావిస్తోందట. ఒకవేళ చివరి నిమిషాల్లో ఎవరైనా గాయపడినా.. లక్నో నుంచి కాన్పూర్ చేరుకోవడానికి కేవలం ఒక గంట సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి పెద్దగా సమస్య ఉందని బీసీసీఐ భావిస్తోంది. అదే సమయంలో కాన్పూర్ టెస్ట్ ప్రారంభమైన తర్వాత కూడా సర్ఫరాజ్ లక్నోకు బయలుదేరవచ్చు.

Also Read: Samsung Galaxy M55s Price: శాంసంగ్ సరికొత్త ఫోన్‌.. ఫ్రంట్‌, బ్యాక్‌ కెమెరాలతో ఒకేసారి వీడియో తీయొచ్చు!

ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రం చేశాడు. కేఎల్ రాహుల్ గాయపడడంతో అతడికి అవకాశం వచ్చింది. సర్ఫరాజ్‌ వరుసగా మూడు టెస్టుల్లో హాఫ్ సెంచరీలు బాది నిరూపించుకున్నాడు. అయితే రాహుల్ జట్టులోకి రావడంతో.. బంగ్లాతో చెన్నైలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. రెండో టెస్టులో కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేవు. ఎవరైనా గాయపడితే తప్ప.. సర్ఫరాజ్‌కు అవకాశం రాదు. ఇప్పటివరకు 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 66.39 సగటుతో 4183 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున 3 టెస్టుల్లో 200 రన్స్ చేశాడు.