NTV Telugu Site icon

Rohith Sharma: బంగ్లా కోసం ప్రత్యేక ప్రణాళికలేమీ రచించాల్సిన పని లేదు: రోహిత్‌

Rohit Sharma Pressconference

Rohit Sharma Pressconference

తాము ప్రత్యర్థి గురించి ఎక్కువగా ఆలోచించమని భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెప్పాడు. బంగ్లాదేశ్‌ కోసం ప్రత్యేక ప్రణాళికలేమీ రచించమని, మిగతా జట్లతో ఎలా ఆడతామో బంగ్లాను కూడా అలాగే ఎదుర్కొంటామని తెలిపాడు. జట్టులోని అత్యుత్తమ ఆటగాళ్లందరూ ప్రతి మ్యాచ్‌లోనూ ఆడేలా చూడాలనుకుంటామని, కొన్నిసార్లు అది సాధ్యం కాదన్నాడు. దేశవాళీల నుంచి ఎంతో మంది యువ బౌలర్లు వెలుగులోకి వస్తుండడం శుభ పరిణామం అని రోహిత్‌ పేర్కొన్నాడు. బంగ్లాతో గురువారం (సెప్టెంబర్ 19) తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో రోహిత్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడాడు.

రోహిత్‌ శర్మ మట్లాడుతూ… ‘భారత్‌ను ఓడించాలని ప్రతి టీమ్ అనుకుంటుంది. అది గర్వకారణంగా భావిస్తారు. వాళ్ల ప్రయత్నం వాళ్లను చేయనివ్వండి. మేం మాత్రం ఎలా గెలవాలన్నదే చూస్తాం. టీమిండియా గురించి ప్రత్యర్థి జట్టు ఏం ఆలోచిస్తుంటుందన్న దానిపై దృష్టిపెట్టం. ప్రతి అగ్రశ్రేణి జట్టుతోనూ మేం మ్యాచ్‌లు ఆడాం. కాబట్టి బంగ్లాదేశ్‌ కోసం ప్రత్యేకంగా ప్రణాళికలేమీ రచించలేదు. బంగ్లాలోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు వచ్చారు. వాళ్ల మీద కాస్త ఫోకస్ పెడితే చాలు. మేం ఎప్పుడూ అనుసరించే ప్రణాళికలనే ఈ సిరీస్‌లోనూ అమలు చేస్తాం’ అని చెప్పాడు.

Also Read: IND vs BAN: అరుదైన రికార్డుపై యశస్వి జైస్వాల్ కన్ను.. కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!

‘అత్యుత్తమ ఆటగాళ్లందరూ ప్రతి మ్యాచ్‌లోనూ ఆడేలా చూడాలనుకుంటాం. కానీ కొన్నిసార్లు అది సాధ్యం కాదు. ఎందుకంటే పనిభారం చాలా పెరిగిపోయింది. టెస్టు క్రికెట్‌ మధ్యలో టీ20లు కూడా ఆడుతున్నాం. బౌలర్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. రొటేషన్ పద్దతిలో ఆడిస్తున్నాం. ఇంగ్లండ్ లాంటి జట్టుతో సిరీస్‌ ఆడుతున్నపుడు కూడా జస్ప్రీత్ బుమ్రాకు ఒక మ్యాచ్‌లో విశ్రాంతిని ఇచ్చాం. దేశవాళీల నుంచి ఎంతో మంది యువ బౌలర్లు వెలుగులోకి వస్తుండడం శుభ పరిణామం’ అని హిట్‌మ్యాన్ చెప్పుకోచ్చాడు.

Show comments