Site icon NTV Telugu

Ashwin-Jadeja: జడేజా అంటే అసూయ.. అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Ashwin Jadeja

Ashwin Jadeja

Ravichandran Ashwin about Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అంటే తనకు అసూయ అని, కానీ అతడిని ఎంతో ఆరాధిస్తాను అని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్ అన్నాడు. సహ క్రికెటర్లతో రేసులో ఉన్నప్పుడు వారి కంటే మనమే ముందు ఉండాలని కోరుకోవడం సహజం అని పేర్కొన్నాడు. జడేజాతో తాను ఎప్పటికీ పోటీ పడలేనని తెలిశాక అతడి మీద అభిమానం పెరిందని యాష్ చెప్పాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు.

మ్యాచ్‌ అనంతరం ఆర్ అశ్విన్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘రవీంద్ర జడేజాది స్ఫూర్తిదాయకమైన జీవితం. జడ్డు బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు చాలా సందర్భాల్లో డ్రెస్సింగ్‌ రూంలో నేను ప్రశాంతంగా ఉండేవాడిని. జడేజా అద్భుతంగా బ్యాటింగ్‌ చేయగలడు, బంతితో అయితే బెంబేలెత్తిస్తాడు. ఇక ఫీల్డ్‌ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నాకు జడేజా అంటే అసూయ. కానీ నేను జడ్డును ఆరాధిస్తా. నాలుగేళ్ల నుంచి అతడి ఆటతీరుకు అభిమానిని అయ్యాను. గత కొన్నేళ్లుగా బాగా ఆడుతున్నాడు’ అని అన్నాడు.

‘సహ క్రికెటర్లతో రేసులో ఉన్నప్పుడు.. వారి కంటే మనమే ముందు ఉండాలని కోరుకోవడం సహజం. ఆ తర్వాత ఒకరినొకరు మెచ్చుకుంటారు. మా విషయంలో అదే జరిగింది. రవీంద్ర జడేజాతో నేను ఎప్పటికీ పోటీ పడలేనని తెలిశాక.. అతడి మీద అభిమానంఇంకా పెరిగింది. కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్.. ఏడాదికి పైగా విరామం తర్వాత ఈ టెస్టు సిరీస్‌తో పునరాగమనం చేశాడు. అయినా కూడా అతడి ఫామ్‌పై నాకు నమ్మకం ఉంది. పంత్ అద్భుత సెంచరీ చేశాడు. అతడిపై ఎలాంటి ఒత్తిడి ఉందని నేను అనుకోను. జట్టు మద్దతు ఎప్పుడూ ఉంటుంది’ అని యాష్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version