NTV Telugu Site icon

Ravichandran Ashwin: ప్రాక్టీస్‌ చేయాల్సిన అవసరం లేదు: అశ్విన్‌

Ashwin Interview

Ashwin Interview

సిరీస్‌ల మధ్య విరామాలు తీసుకోవాలని, అప్పుడే ఫిట్‌గా ఉండొచ్చని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్ అన్నాడు. నైపుణ్యం కంటే శారీరకంగా ఫిట్‌గా ఉంటూ సీజన్‌ను పూర్తి చేయడమే అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. జట్టులో కొనసాగాలంటే నిరంతరం ప్రాక్టీస్‌లోనే ఉండాల్సిన అవసరం లేదని యాష్ పేర్కొన్నాడు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్న అనంతరం రవిచంద్రన్‌ అశ్విన్ మాట్లాడుతూ… ‘రానున్న నెలల్లో చాలా టెస్టులు ఆడాల్సి ఉంది. సుదీర్ఘ సీజన్ అనే చెప్పాలి. కఠినమైంది కూడా. కొన్నిసార్లు భవిష్యత్తు తలచుకుంటే కష్టంగా అనిపిస్తుంటుంది. 3-4 నెలల్లో 10 టెస్టులు ఆడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడమే మంచిది. సిరీస్‌ల మధ్య విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే ఫిట్‌గా ఉండొచ్చు. నైపుణ్యం కంటే శారీరకంగా ఫిట్‌గా ఉంటూ సీజన్‌ను పూర్తి చేయడమే నా లక్ష్యం. అందుకే రెండు సిరీస్‌ల మధ్య విరామం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటా’ అని చెప్పాడు.

Also Read: Rishabh Pant: బంగ్లాదేశ్ ఫీల్డింగ్ సెట్ చేయడానికి కారణం అదే: పంత్

‘కెరీర్‌ ఆరంభంలో క్రికెట్‌ ఆడటం వేరు, 38 ఏళ్ల వయసులో ఆడటం వేరు. వయసు పెరుగుతున్నా కొద్దీ రెట్టింపు కృషి చేయాలి. అప్పుడే టెస్టుల్లో ఓపికగా ఆడగలం. అలానే జట్టులో కూడా కొనసాగగలం. అలా అని ఎప్పుడూ ప్రాక్టీస్‌ చేయాల్సిన అవసరం లేదు. నేను ప్రాక్టీస్‌ సెషన్‌లను తగ్గించి.. ఇతర అంశాలలో విభిన్నంగా ప్రయత్నిస్తాను. నేను యోగా చేస్తాను. యోగా ఆటకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది’ అని రవిచంద్రన్‌ అశ్విన్ తెలిపాడు. బంగ్లా సిరీస్ అనంతరం న్యూజీలాండ్, ఆస్ట్రేలియాతో భారత్ టెస్ట్ సిరీస్‌లు ఆడాల్సి ఉంది.